లింగాల ఘనపురం : గుండెలనిండా కేసీఆర్ నిండి ఉండగా దాన్ని ఎవరు చేరప లేరని రుజువు చేస్తున్నాడు జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన బెజ్జం చంద్రయ్య. తన నారుమడిలో కేసీఆర్ పేరుతో వరి విత్తనాలను నాటి అభిమానాన్ని చాటుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే లింగాల గణపురానికి చెందిన బెజ్జం చంద్రయ్యకు లింగాల గణపురంలో ఆరు ఎకరాల పొలం ఉంది. నీళ్లు లేక, కరెంటు సక్రమంగా రాక పెట్టుబడి లేక తన పొలాన్ని కౌలుకిచ్చి ఆటోను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేవాడు.
స్వరాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ సీఎం కావడమే కాకుండా పెట్టుబడికి రైతుబంధు, ఉచిత కరెంటు,మిషన్ భగీరథతో చెరువులను నింపడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించడంతో అప్పటి నుంచి తన పొలాన్ని కౌలుకి ఇవ్వడం నిలిపివేసి సొంతంగా సాగు చేస్తూ ఆటో వృత్తిని పక్కన పెట్టాడు. అంతేకాకుండా కూతురుకు వివాహం చేయగా కల్యాణ లక్ష్మి పథకం, మనవరాలు జన్మించగా కేసీఆర్ కిట్టు అందడంతో ఆ కుటుంబం అంతా కేసీఆర్ కుటుంబంగా మారింది. నేడు వరినారు అలుకగా అదే మడిలో కేసీఆర్ పేరుతో వరి విత్తనాలను అలికి తన అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాడు.