వరంగల్, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోరుగడ్డ ఓరుగల్లు మరో కీలక ఘట్టానికి వేదిక కానున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను వరంగల్‌లోనే నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించడం ప్రాధాన్యం సం తరించుకుంది. సామాజిక, రాజకీయ ఉద్యమాలకు మొదటినుంచీ చిరునామాగా ఉంటున్న చా రిత్రక నగరం వరంగల్ సమైక్య పాలకుల దోపిడీని ఎదుర్కొని స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, స్వరాష్ట్రంలో సంక్షేమ పాలన అమలులో సెంటిమెంట్‌గా నిలుస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు, బీఆర్ఎస్ ప్రస్థానంతో గొప్ప మలుపులకు వరంగల్ కేంద్రంగా ఉంటున్నది. ఈ పరంపర ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ ఉత్సవాల బహిరంగ సభను వరంగల్‌లోనే నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గతంలో వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభతో ప్రపంచ రికార్డు నమోదు చేయగా ఇప్పుడు మరోసారి అంతే స్థాయిలో భారీ సభకు సిద్ధమైంది.
ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని శుక్రవారం బీఆర్ఎస్ ము ఖ్యనేతల సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు. అధినేత ఆదేశాల మేర కు సమీక్ష సమవేశానికి వెళ్లే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లిలో స్థలాలను పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల మధ్య ప్రాంతంలో భారీ బహిరంగసభ నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిసింది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్కు, కేసీఆర్ కు సెంటిమెంట్‌గా ఉన్న వరంగల్‌లో నే మరోసారి కీలకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గులాబీ శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నది.