మహబూబాబాద్ రూరల్, జూన్ 18 : తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ నివాసంలో మానుకోట నియోజకవర్గ నాయకులతో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సర్ కార్యక్రమంపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానుకోట జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టామన్నారు.
రైతును రాజు చేసేలా కేసీఆర్ పాలన కొనసాగిందని, రైతులు 37 రకాల సన్నాలు పండించినట్లు తెలిపారు. నేడు రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను గోసపెడుతూ కేవలం ఏడు రకాల సన్నాలు మాత్ర మే పండించాలని ఆంక్షలు పెడుతున్నదన్నారు. అధికారంలోకి రావడానికే రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికే 3 నెలల సమయం పడుతున్నదని, మద్దతు ధరలకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక కష్టాలు పడుతున్న ప్రజలు ‘కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలి’ అని కోరుకుంటున్నారని తెలిపారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెడుతున్న రేవంత్‌రెడ్డి, బడా కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఇచ్చి కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. డోర్నకల్ నియోజకవర్గం అయ్యగారిపల్లిలో రెండేళ్ల క్రితం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి ఇప్పటికీ తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. కేసీఆర్ పాలనలో పల్లె నుంచి పట్టణాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే.., రేవంత్‌రెడ్డి పాలనలో పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రజలు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి బూత్‌లో అర్హులందరికీ సభ్యత్వం ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో ప్రతి ఇన్చార్జి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సర్ ఓటర్ల సవరణకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు.
ఇందులో పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉందని, బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటికి వచ్చేటప్పుడు బూత్ లెవల్ ఏజెంట్లు వెంట ఉండాలన్నారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డివి మోసపూరిత వాగ్దానాలన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రకటించి, వాటిని అమలు చేయడాంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, హైడ్రా పేరిట పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చివేస్తున్నాడని అన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక పాలనపై ప్రశ్నించిన అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, వారి కుటుంబాలను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. ఆపద కాలంలో కష్టపడి పని చేసిన కార్యకర్తలను పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పని చేసి సభ్యత్వం నమోదును ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్‌కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, రంగారావు, తేళ్ల శ్రీను, లూనావత్ అశోక్‌నాయక్, రావుల రవిచందర్‌రెడ్డి, కత్తుల ఎలేందర్, నజీర్, కృష్ణారెడ్డి, నవీన్, నర్సింగ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.