అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా సెంటర్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. వారి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. బాలికలకు గులాబీ, బాలురకు నీలి రంగు గ్రోత్ కార్డులు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నెలనెలా పరిశీలించి వీటిలో నమోదు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త కార్డులు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు చేరాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి బాలామృతం ప్లస్, పాలు, గుడ్లు అందిస్తారు. జిల్లాలోని హనుమకొండ, పరకాల, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో 32,797 మంది చిన్నారులు ఉన్నారు.
హనుమకొండ, జూలై 29 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. బాలల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎదిగే పిల్లలు, వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటి వరకు చిన్నారుల ఆరోగ్య వివరాలను పరిశీలించి అంగన్వాడీ టీచర్లు రికార్డుల్లో నమోదు చేసేవారు. ఈ విధానంతో వారి ఆరోగ్య వివరాలు తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉండేదికాదు. ఈ అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్య ప్రొఫైల్‌ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం బాల బాలికలకు వేర్వేరు రంగుల్లో కొత్తగా కార్డు విధానం అమలు చేయాలని నిర్ణయించారు. బాలికలకు గులాబీ, బాలురకు నీలి రంగు కార్డులను ఇవ్వనున్నారు. ప్రతి ఒక చిన్నారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రతి నెల నెల పరిశీలించి కార్డుల్లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త కార్డులు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు చేరినట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టు పరిధిలో 32,797 మంది చిన్నారులకు కొత్త కార్డులు అందజేయనున్నారు.
జిల్లాలో మూడు ప్రాజెక్టులు
జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 789 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 32,797 మంది చిన్నారులు ఉన్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 0 నుంచి 6 నెలల వయస్సు ఉన్నవారు 4,092 మంది, 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు వారు 20,836 మంది, 3 నుంచి 6 సంవత్సరాలలోపు ఉన్న వారు 8,569 మంది చిన్నారులు ఉన్నారు.
రెండు రంగుల్లో కార్డులు
ప్రతి చిన్నారికి సంబంధించి కొత్తగా ఆరోగ్య గ్రోత్ కార్డులను అందించనున్నారు. నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న విధానంతో చిన్నారుల వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు రికార్డు చేసినప్పటికీ అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు గుర్తించడం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం కొత్తగా కార్డు విధానం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రెండు రంగుల కార్డులను ఇప్పటికే అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు పంపించారు. కార్డులు వినియోగంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కార్డుల్లో ఏ వయస్సులో ఎంత ఎత్తు, బరువు, పెరుగుదల, పోషక లోపం ఉన్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలను కార్డులో పొందుపరిచారు.
ప్రతి నెల పరిశీలన.. నమోదు
అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి చిన్నారి ఎత్తు, బరువు, పెరుగుదల పౌష్టికాహార స్థాయిలను నెల నెలా పరిశీలించి కార్డులో నమోదు చేయనున్నారు. ఈ కార్డులో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు బాలల ఎత్తుకు తగిన బరువును సూచించే చార్టు ముంద్రించి ఉంటుంది. పోషణ స్థితి ఏ విధంగా ఉందో రంగుల రూపంలో పొందు పరిచారు. అదేవిధంగా రెండు సంవత్సరాల పిల్లల పోషణ విషయంలో ఎలాంటి పోషకాహారం, సంపూర్ణ ఆరోగ్యం తదితర విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేలా సూచనలు చేస్తారు. అంతేకాక పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి బాలామృతం ప్లస్, పాలు, గుడ్లు, విటమిన్లతో కూడిన పోషకాహారం అందిస్తారు. అలాగే, కార్డులో చిన్నారి పేరు, తల్లిదండ్రుల పేర్లు, చిన్నారి పుట్టిన తేదీ, ఆరోజు బరువు, అంగన్వాడీ కేంద్రం, చిరునామా తదితర వివరాలు పొందుపరుస్తారు. అదే విధంగా ప్రతి సంవత్సరం పాస్‌ఫొటో సేకరించి కార్డులో అంటిస్తారు.
పోషక లోపాన్ని గుర్తించవచ్చు..
అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా అమలు చేయనున్న ఆరోగ్య గ్రోత్ కార్డుల ద్వారా పోషక లోపం ఉన్నవారిని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా వయస్సు తగ్గ ఎత్తు, బరువు, పెరుగుదలతో పాటు ఏమైన పోషక లోపం ఉందా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు ఉంటాయి. బాలికలకు పింక్, బాలురకు బ్లూ రంగులో రూపొందించిన ప్రత్యేక కార్డులను అంగన్వాడీ టీచర్‌తో పాటు తల్లిదండ్రులు కూడా సులభంగా గుర్తించవచ్చు. ఈ కార్డును చిన్నారి తల్లికి అందజేస్తారు. ప్రతి నెల కార్డును తీసుకొచ్చి చిన్నారి బరువు, ఎత్తు, పెరుగుదల, పోషకాహార పరిస్థితిని పరిశీలించి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల పూర్తిస్థాయి స్థితి తెలుస్తుంది.
– కే మధురిమ, హనుమకొండ ప్రాజెక్టు సీడీపీవో