హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25 : మూడు రోజులుగా ఛత్తీగఢ్-తెలంగాణ సరిహద్దులలో ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో వేలాదిగా పోలీసులు బలగాలను మోహరించారు. ఆదివాసులను, మావోయిస్టులు నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, ప్రభుత్వం ఆయా రాష్ట్రాల సమన్వయంతో కొనసాగిస్తున్న కాల్పులను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాత్యాయని విద్మహే మాట్లాడుతూ మధ్య భారతంలో ఆదివాసుల హనణాన్ని ఆపివేయాలన్నారు.
ప్రజాస్వామిక, రాజ్యాంగ అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం నాయకుడు పి.రమేశ్ చంగర్, మానవహక్కుల వేదిక నాయకుడు బాదావత్ రాజు, టీపీఎఫ్ జే.కుమారస్వామి, సీఎంఎస్ కె.కళావతి, ఏబీఎంఎస్ శాంత, పీడీఎం క్రాంతి, విరసం నేతలు కోడం కుమార్, ఎం.కుమారస్వామి, న్యూడెమోక్రసీ నాయకుడు రాచర్ల బాలరాజు, సోషల్ సైంటిస్ట్ ఎం.ప్రవీణ్‌కుమార్, డీఎస్ఏ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఎం.వి.శివ, కేఎన్పీఎస్ నేత ఎం.యాకుబ్, న్యూడెమ్రోసీ నేత జి.దయాకర్, సీఎల్సీ అమరేందర్, ప్రవీణ్, జయంత్ పాల్గొన్నారు.