‘కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష్టం గా కనిపిస్తున్నదని సంతోషం వ్యక్తంచేశారు. ఇంటికి దగ్గరలోనే క్యాంపు లు పెట్టి, ఫ్రీగా టెస్టులు చేయడం బాగున్నదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 20 : హనుమకొండ జిల్లా కాజీపేటలోని సోమిడి, బాలాజీనగర్‌లో కంటివెలుగు శిబిరాలను చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సందర్శించి పరీక్షలు చేసుకున్న వారిని పలకరించి ఆరా తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని 3వ వార్డులో ఏర్పాటుచేసిన శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి కంటివెలుగు నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో కంటివెలుగు క్యాంపును కలెక్టర్ శశాంక తనిఖీ చేసి రోగులకు ఇబ్బందిలేకుండా చూడాలని వైద్యు లు, సిబ్బందికి సూచించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట, ఆలింపూర్లోని శిబిరాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెళ్లి పరీక్షలు, అద్దాల పంపిణీ తీరును పర్యవేక్షించి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జఫర్‌గఢ్ మండలం కూనూరులో కంటివెలుగు అవగాహన ర్యాలీలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని ఇప్పగూడెంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత శిబిరంలో అద్దాలు తీసుకున్న వారిని ఆప్యాయంగా పలకరించి ‘కంటి వెలుగు’ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అలాగే వరంగల్ జిల్లాకేంద్రంలోని ఇన్నర్‌వీల్ క్లబ్ సహా పలు శిబిరాల్లో పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.
జాగ్రత్తలు మంచిగ చెప్పిన్రు
– బాణాల లక్ష్మి, ఎల్కతుర్తి
ఎల్కతుర్తి : ఇదివరకు నాకు కండ్లు సరిగ్గా కనవడకుంటె ప్రైవేట్ దవాఖానకు పోయి చూపించుకున్న. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి కండ్ల మందులు, అద్దాలిచ్చిన్రు. గిప్పుడు కేసీఆర్ రూపాయి ఖర్సు లేకుంట కండ్ల పరీక్షలు చేస్తాండని తెలిసి మా దగ్గర్నే పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు కొన్ని మందులిచ్చిండ్రు. మరీ ఎక్కువగా కనిపించకపోతే అద్దాలు కూడా ఇస్తామని చెప్పిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగనే కనిపిస్తున్నయ్. పైసలేం తీసుకోలేదు. కండ్లు మంచిగుంటే ఏ పని అయినా చేసుకోవచ్చు. గిట్ల కేసీఆర్ సార్ కండ్ల పరీక్షలు చేసి మందులు, అద్దాలిచ్చుడు సంతోషంగ ఉంది.
మస్క మస్క పోయింది
– బోగి నీరజ, భూపాలపల్లి
భూపాలపల్లి టౌన్ : నేను ఇంట్లో పనులు చేసుకునేటప్పడు కళ్లు కొంచెం మస్కగ కనిపించేటియి. అప్పుడప్పుడు చుక్కల మందు వేసుకునేది. అయినా ఏం మార్పు కనిపించలే. సీఎం కేసీఆర్ కంటివెలుగు క్యాంపు పెట్టిన్రని తెలిసి నేను కూడ వచ్చిన. డాక్టరు మిషన్తోటి పరీక్షలు చేసి అద్దాలు రాసిండు. అప్పడే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సారు కూడ వచ్చిండు. ఆయనే నాకు కండ్లద్దాలు ఇచ్చిండు. అవి పెట్టుకొని అక్కడున్న కంటివెలుగు పేపర్(ఆహ్వాన పత్రిక) చదివిన. అక్షరాలు చాలా స్పష్టంగా కనిపించినయ్. చాలా సంతోషంగ ఉంది. ఇది మంచి కార్యక్రమం.
కేసీఆర్ కొత్త వెలుగు నింపిండు
– రవి, దివ్యాంగుడు, సీఆర్‌నగర్, భూపాలపల్లి
భూపాలపల్లి టౌన్ : సీఎం కేసీఆర్ మా ఆశాదీపం. నాలాంటి దివ్యాంగులకు ఆయన దేవుడు. మా కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిండు. నాకు చెల్పూర్లో టైర్ పంచర్ షాపు ఉంది. ప్రతిరోజూ సీఆర్‌నగర్ నుంచి ఆటో లో, బస్సులో వెళ్లి రావడం ఇబ్బంది అయ్యేది. సీఎం సారు పుణ్యమా అని నాకు మూడు గీరల బ్యాటరీ బండి ఇచ్చిన్రు ఆఫీసర్లు. ఇప్పుడు రోజు నేను ఆ బండి మీదనే చెల్పూర్‌కు వస్తున్న. దివ్యాంగుల పింఛన్ కూడా వత్తాంది. నాకు అవిటితనం ఉందనే సంగతే మరిశిపోయిన. ఇప్పుడు సీఎం కేసీఆర్ పెట్టిన కంటివెలుగుల కండ్ల పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు నజర్ మంచిగ కనవడ్తాంది. అద్దాలు పెట్టుకుంటే మంచిగున్నది.
ఊళ్లెనే క్యాంపు పెట్టుడు మంచిగుంది..
– ఉండీల బుచ్చమ్మ, సంగెం
సంగెం : నేను మొన్న సంగెం దవాఖానకు పోయి సూయిచ్చుకున్న. డాక్టర్లు పరీక్షలు చేసి కంటిలో పొరలు ఉన్నయని చెప్పిన్రు. వరంగల్‌లో ఆపరేషన్ చేస్తామని చెప్పి పేరు రాసుకున్నరు. ఫొటో తీసుకున్నరు. సుక్కలమందు ఇచ్చిండ్రు, మేము చెప్పినప్పుడు వస్తే కంటికి ఆపరేషన్ చేయిస్తమన్నరు. నేనెప్పుడు కూడ కంటి పరీక్షలు చేపిచ్చుకోలే. ఇప్పుడు కేసీఆర్ సారు ఊరూరికి కంటివెలుగు క్యాంపులు పెట్టుట్ల నాకు మేలైంది. ఉన్న ఊళ్లెనే డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చుడు మంచిగున్నది. నా కొడుకు తీసుకపోయి చూయించిండు. కేసీఆర్ పదికాలాల పాటు సల్లగుండాలె.
కండ్లద్దాలు, మందులు ఫ్రీగనే ఇచ్చిన్రు..
– వాంకుడోత్ కౌసల్య, అమ్మపాలెం, డోర్నకల్
డోర్నకల్ : కంటివెలుగు క్యాంపుల ఫ్రీగా పరీక్షలు చేసిన్రు. ప్రైవేట్ దవాఖానకు పోయి పరీక్షలు చేయించుకుంటే మస్తు పైసలైతయ్. క్యాంపు ఉంటదని వారం కిందనే ఇంటింటికి అచ్చి దవాఖానోళ్లు చెప్పిన్రు. అందరూ వచ్చి పరీక్షలు చేపిచ్చుకోవాలన్నరు. క్యాంపు మొదలుకాంగనే నేడు పోయి కండ్ల పరీక్షలు చేపించుకున్న. పెద్ద పెద్ద మిషిన్లతోటి అన్నితీర్ల పరీక్షలు చేస్తున్నరు. నాకు కూడా కండ్ల అద్దాలు, మందులు ఫ్రీగా ఇచ్చిన్రు. మా అసొంటోళ్ల కోసం గింత శ్రద్ధ తీసుకొని పరీక్షలు చేపిస్తున్నందుకు కేసీఆర్ సార్‌కు దండాలు.
పేదోళ్లకు ఎంతో మేలు
– సింగు రమ, చిన్నగూడూరు
చిన్నగూడూరు : ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదోళ్లకు ఎంతో మేలు చేస్తుంది. భార్యాభర్తలం ఇద్దరం టైలరింగ్ పని చేస్తం. నాకు కొన్ని నెలల నుంచి కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్న. ఊళ్లో కంటి పరీక్షలు చేస్తున్నరని టాంటాం చేస్తే మొన్ననే పోయి పరీక్ష చేయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మంచిగ కనిపిస్తాంది. కేసీఆర్ ప్రతి ఇంటికి పథకాలు అందిస్తుండు. ఇప్పడు కంటివెలుగుతో మందులు, కండ్లద్దాలు ఇచ్చి మంచిగ సాయం చేస్తాండు.