నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 27 : ‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో శిబిరాలు కిటకిటలాడాయి. పలు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను వైద్యాధికారులు సందర్శించి, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. ప్రజలు పరీక్షలు చేయించుకొని అద్దాలు పెట్టుకొని సంబురపడ్డారు. చూపు చక్కగా కనిపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. పైసా ఖర్చు లేకుండా ఇంటికి దగ్గరలోనే కంటి పరీక్షలు చేసి, అద్దాలివ్వడం బాగున్నదంటూ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సూపు మంచిగైంది..
మహదేవపూర్: నాకు కళ్లు సక్కగ కనిపించేక పోయేది. ఇంట్ల పనులు చేసుకోవడానికి చాన ఇబ్బందయ్యేది. కంటి వెలుగు శిబిరం పెట్టినమని మొన్న ఇంటికి వచ్చి చెప్పిన్రు. నేను పోయి పరీక్షలు చేయించుకుంటె కళ్లద్దాలు, మందులు ఇచ్చిన్రు. ఇప్పుడు నాకు సూపు సమస్య లేదు. చాన సంతోషంగ ఉంది. సర్కారు ఇలా చేయడం వల్ల కంటి సూపు ఇబ్బందులు తప్పినయ్. సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటం.
– ఎండీ ఫర్జానా, మహదేవపూర్
కేసీఆర్ సార్ మేలు మరువలేం..
జనగామ రూరల్: దవాఖానకు పోకుంట మా వార్డుల్నె కంటి వెలుగు శిబిరం పెట్టిన్రు. పోయినసారి కూడా నేను కంటి పరీక్ష చేయించుకుంటే అద్దాలిచ్చిండ్లు. ఇయ్యాల నేను మల్ల కంటి పరీక్షలు చేయించుకున్న. వేళ్లు, అక్షరాలు చూపించి సూపును తెలుసుకుని మంచి కళ్లద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు బాగ కనవడ్తానయి. ప్రైవేట్ దవాఖానకు పోతే మస్తు డబ్బులయితయి. సర్కారు ఉచితంగ పరీక్షలు చేత్తాంది. సీఎం కేసీఆర్ సార్ మేలు మరిచిపోలేం.
– కర్ధూరి చంద్రకళ, 6వ వార్డు, జనగామ
రెండు రోజులైనంక అద్దాలిత్తమన్నరు..
చిన్నగూడూరు: మా లాంటి పేదోళ్లను కేసీఆర్ సార్ ఆదుకుంటాండు. నాకు కళ్లు మసకగ ఉన్నాయని శిబిరానికి ఎల్లిన. ఇంటి పక్కోళ్లు చెప్తె ఏమో అనుకుని పోతె తెలిసింది పెద్ద మిషన్ల తోటి పరీక్షలు చేస్తాండ్రని. నాకు ఫిరీగా కంటి పరీక్ష చేసిండ్రు. రెండు దినాల తర్వాత కండ్లద్ద్దాలు ఇస్తమన్నరు. ఊల్ల చాన మంది ముసలోళ్లు కేసీఆర్ అద్దాలు పెట్టుకుని తిరుగుతున్రు. ఎవల్నడిగినా మంచిగ కనిపిస్తాయని చెప్తాన్రు.
– మద్దెల భద్రమ్మ, చిన్నగూడూరు
సర్కారుకు రుణ పడి ఉంట
చెన్నారావుపేట: నాకు చాన రోజుల నుంచి కళ్లు మస్క మస్కగ కనవడుతాంటె ఇక్కడికి వచ్చిన. ప్రైవేట్ దవాఖాన లెక్క మంచిగ పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్లు. ఒక్క రూపాయి కూడ అడుగలే. పాణం సంబురంగ ఉన్నది. ఇప్పుడు కళ్లు మస్తు మంచిగ కనిపిస్తానయ్. నా లెక్కన చాన మందికి పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు ఇచ్చిన్రు. గీ సర్కారుకు, కేసీఆర్కు రుణపడి ఉంట.
– చామంతుల భారతమ్మ, జల్లి(చెన్నారావుపేట)
పేదోళ్లకు వరం
దంతాలపల్లి: ప్రజలను ఆదుకునుట్ల కేసీఆర్ సారును మించినోళ్లు లేరు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్రు. మాది పేద కుటుంబం. నాకు కళ్లు సరిగ్గ కనబడుత లేవని మా ఊరిల పెట్టిన శిబిరంల పరీక్షలు చేయించుకుంటె డాక్టర్లు కండ్లద్దాలిచ్చిన్రు. ఇప్పడు మస్తుగ కనిపిస్తున్నయ్. నాలాగే చాన మంది పరీక్షలు చేయించుకుంటాన్రు. ఫిరీగా వైద్యం చేస్తున్న సర్కారుకు రుణపడి ఉంట.
– అంకం సుజాత, దంతాలపల్లి
తేటగ కన్పిస్తున్నయ్
పరకాల: రెండేళ్లుగా దగ్గరి సూపు తగ్గి కండ్లు సరిగ్గ కనవడుత లేవు. ప్రైవేట్ల చూపిచ్చుకుందమంటే పైసలు లేకపోయె. గిప్పుడు సర్కారు మా వార్డుల కంటి వెలుగు శిబిరం పెడితె పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్ పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇచ్చిన్రు. అవి పెట్టుకుంటె తేటగ కన్పిస్తున్నయ్. మా ఇంటి దగ్గరే కంటి పరీక్షలు చేసి అద్దాలియ్యడం సంతోషంగుంది. సర్కారు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఎండీ పర్వీన్, పరకాల
నజర్ మంచిగుంది
గీసుగొండ: కూలికి పోయే నాకు కళ్లు సరిగ కనబడక ఇబ్బంది పడ్డ. ఊర్లల్ల రోజు నర్సులు ఇండ్ల కాడికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని చెప్తె పోయిన. పరీక్ష చేసి కళ్లద్దాలు ఇచ్చిన్రు. పైసలు లేక ప్రైవేటు దవాఖానకు పోలే. సీఎం కేసీఆర్ దేవుడిల మా గోసను చూసి గీ పరీక్షలు చేపిత్తాండు. అద్దాలు పెట్టుకుంటె కళ్ల నజర్ బాగున్నది.
– అప్పని లత, గీసుగొండ
దూరంగున్నయ్ కనవడ్తానయ్..
దుగ్గొండి: చాన ఏండ్ల నుంచి దూరంగా ఉన్న వాటిని గుర్తు పట్టకపోయేదాన్ని. దగ్గరున్న మనుసులు, వస్తువులు కనబడేటియి. కంటి దవఖానకువెళ్లి సూపించుకోవాల్నంటె చాన ఇబ్బందయ్యేది. ఇయ్యాల ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమంల డాక్టర్లు మా ఊరికి వచ్చి పరీక్షలు చేసి కళ్లద్దాలిచ్చిన్రు. గిప్పుడు దూరంగున్నయి మంచిగ కనవడ్తానయ్. కంటి ఆపరేషన్లు సుత ఫిరీగ చేయించడం ఎంతో సంతోషంగ ఉంది.
– లింగంపల్లి సావిత్రి, శివాజీనగర్(దుగ్గొండి)
పైసా ఖర్చు లేదు..
దుగ్గొండి: నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలిస్తున్నరు. ఈ పరీ క్షలతో సీఎం కేసీఆర్ పేదవారి గుండెల్లో నిలిచిపోతడు. కళ్లు సరిగా కనవడక, ప్రైవేటు దవాఖాన్ల సూపించుకోలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్రు. వారందరికి కంటి వెలుగు కార్యక్రమం పెట్టడం ఎంతో బాగుంది. ప్రతి ఒక్కలూ కంటి పరీక్షలు చేయించుకుంటాన్రు.
– సాంబమూర్తి, ఆటో డ్రైవర్, ముద్దునూరు
అద్దాలు మంచిగున్నయ్..
ములుగురూరల్: గ్రామపంచాయతీ ఆఫీస్ల ఉచితంగ కంటి పరీక్షలు చేస్తాన్రని తెలిసి పోయిన. డాక్టర్లు దగ్గర సూపు తక్కువైందని ఫ్రీగా అద్దాలిచ్చిన్రు. అంతకు ముందు చిన్న అక్షరాలు కనవడకపోయేది. ఇప్పుడు మంచిగ కనవడుతున్నయ్. సర్కారు గిట్ల కంటి పరీక్షలు చేయించడం బాగుంది. ఇవి నా లాంటి ఎంతో మందికి ఉపయోగపడుతున్నయ్. అద్దాలు కూడా మంచిగున్నయ్.
– గుగోలోత్ చంద్రకళ, ములుగు