రాయపర్తి, జనవరి 19 : రాష్ట్రంలోని పేద ప్రజలందరి కష్టనష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కంటి వెలుగు-2.0 శిబిరాన్ని గురువారం రాయపర్తి ఎంపీపీఎస్‌లో కలెక్టర్ బీ గోపితో కలిసి ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ధులు, మహిళలు, యువతకు దగ్గరుండి నేత్ర పరీక్షలు చేయించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రథసారధిగా సుదీర్ఘ కాలం తెలంగాణలోని అణువణువూ తిరిగిన కేసీఆర్‌కు సబ్బండ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, ఇబ్బందులు, అవస్థలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. కంటి సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్థోమత లేని అనే క మందిని గమనించిన సీఎం కేసీఆర్ మూడేళ్ల క్రితం రాష్ట్రంలో నిర్వహించిన కంటి వెలుగు అద్భుత ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. దీంతో రెండో దఫా ప్రారంభించారన్నారు. పేదల అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తున్న ఆయనకు ప్రజలు అండగా నిలువాలని కోరారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో గుబులు పుడుతోందన్నారు. ఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సదస్సు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. కంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వర్ధన్నపేట ఐసీడీఎస్ సీడీపీవో శ్రీదేవి, సూపర్వైజర్ సత్యవతి సారథ్యంలో చిన్నారులకు మంత్రి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఐసీడీఎస్ ఉద్యోగులు అలసత్వం వీడాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
రాయపర్తి సమగ్రాభివృదికి కృషి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సర్పంచ్ నర్సయ్య అభ్యర్థన మేరకు నూతన జీపీ భవన నిర్మాణం కోసం మరో రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీపీఎస్ స్థలంలో రూ.50లక్షలతో జీపీ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. మండలకేంద్రంలోని రహదారికి ఇరువైపులా మురుగు కాల్వలు, అవసరమైన చోట్ల బ్రిడ్జిలు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంటి వెలుగు డిప్యూటీ డైరెక్టర్ పుష్ప, జడ్పీ సీఈవో సా హితీమిత్ర, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డాక్టర్ మధుసూద న్, మండల ప్రత్యేకాధికారి నరేశ్కుమార్నాయు డు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీఎం అశోక్‌కుమా ర్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, మండల పశు వైద్యాధికారి వీరగోని శృతి, డాక్టర్ సోమశేఖర్, మండల నాయకులు పూస మధు, ఎండీ నయీం, ఉస్మాన్, కాంచనపల్లి వనజారాణి, బందెల బాలరాజు, అక్బర్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, ఉబ్బని సింహాద్రి, జీపీ కార్యదర్శి గుగులోత్ అశోక్‌నాయక్ పాల్గొన్నారు.