కమలాపూర్, మే 4: కాన్పు చేసి.. కడుపులోనే కాటన్ క్లాత్ మరిచి కుట్లు వేసిన వైద్యుల ఉదంతం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన వానరాసి తిరుమల డెలివరీ కోసం కమలాపూర్ 30 పడకల ఆసుపత్రిలో గత నెల 27న అడ్మిట్ అయింది.
అదే రాత్రి కాన్పు చేసిన వైద్యులు కడుపులోనే క్లాత్ మరిచి కుట్లు వేశారు. ఆసుపత్రి నుంచి మూడు రోజులకు తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. తిరుమలకు కడుపు నొప్పి తీవ్రత పెరగడంతో సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గమనించిన వైద్య సిబ్బంది (ఏఎన్ఎం) కుట్లు రెండు విడిపోవడంతో కడుపులో నుంచి క్లాత్‌ను బయటకు తీసింది. పెద్దాసుపత్రి అని వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ ఉంచారని ఆందోళన చేశారు. ఏం చేసుకుంటారో చేసుకో అని సిబ్బంది బెదిరించినట్లు బాధితులు తెలిపారు.
దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై పీఏసీఎస్ డైరెక్టర్ మౌటం రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను సముదాయించారు. రోగిని ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. ఈ విషయమై డాక్టర్ భానుప్రసాద్‌ను వివరణ కోరగా డెలివరీ చేసి రక్తం బ్లీడింగ్ కాకుండా క్లాత్ పెట్టినట్లు చెప్పారు. గైనకాలజిస్ట్ డెలివరీ చేసినట్లు తెలిపారు.