పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచే ఆర్థికంగా భరోసానిచ్చేందుకు గత కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాబితాలో ఇతరుల పేర్లు చేర్చి వారికి మంజూరైన ఆర్థిక సహాయాన్ని మరకొరి ఖాతాకు మళ్లిస్తున్నట్లు తెలిసింది.
వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల్లో రెండేళ్లుగా ఈ తతంగం నడుస్తుండగా సాయం మంజూరైనా ఇంకా అందలేదని దరఖాస్తుదారులు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా అప్పటికే అక్రమార్కులు చెక్కులను డ్రా చేసుకోగా ఈ వ్యవహారంపై విచారణ మొదలైంది. ఇందులో ఆర్డీవో ఆఫీసులోని ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తేలగా, జిల్లాలో ఎన్ని మండలాల్లో, ఎప్పటినుంచి జరుగుతోంది? మొత్తం వచ్చిన దరఖాస్తులు, మంజూరైన వివరాల జాబితా, ఆర్డీవో ఆఫీస్ నుంచి బ్యాంకుకు పంపిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
– వరంగల్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ)
జిల్లాలోని వివిధ మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ పక్కదారి పట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఈ పథకాల ద్వారా కొందరు లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని అక్రమార్కులు కాజేసినట్లు సమాచా రం. వరంగల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం(ఆర్డీవో) కేంద్రంగా ఈ వ్యవహారం జరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కల్యాణలక్ష్మి పథకం ద్వా రా ప్రభుత్వం అర్హులైన దరఖాస్తుదారులకు రూ.1,00, 116 ఆర్థిక సహాయం అందజేస్తుంది.
ఇందుకోసం ఆయా మండలంలోని అర్హులైన తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం చేసిన తర్వాత కల్యాణలక్ష్మి పథకం నుంచి ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో తమ కూతురి పేర ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. స్థానిక తహసీల్దార్ లాగిన్లోకి చేరే ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో రెవె న్యూ శాఖ అధికారులు పరిశీలిస్తారు. వెరిఫికేషన్ అనంతరం దరఖాస్తుదారుల జాబితాను స్థానిక ఎమ్మెల్యేకు పంపిన తర్వాత సహాయం మంజూరు కోసం ఆర్డీవో కార్యాలయానికి చేరుతుంది. ఆమోదముద్ర పడగానే నిధుల విడుదల కోసం లబ్ధిదారుల పేర్లతో కూడిన లిస్ట్ ఎస్టీవో ఆఫీసుకు వెళ్తుంది.
కులంవారీగా వెసులుబాటును బట్టి ఎస్టీవో కార్యాలయం నుం చి ఆర్డీవో పేర ఉన్న బ్యాంకు ఖాతాకు నిధుల విడుదల జరుగుతున్నట్లు తెలిసింది. ఈమేరకు నిధులు విడుదలైన కల్యాణలక్ష్మి లబ్ధిదారుల జాబితా ఎప్పటికప్పుడు ఎస్టీవో ఆఫీసు నుంచి ఆర్డీవో కార్యాలయానికి అందుతున్నట్లు సమాచారం. తీరా ఆర్డీవో ఆఫీసు నుంచి కల్యాణలక్ష్మి పథకం చెక్కుల తయారీ కోసం బ్యాంకుకు వెళ్లే అనెక్జర్లో పేర్లు మారుతున్నట్లు తెలిసింది. వరంగల్ ఆర్డీవో కార్యాలయం నుంచి స్థానిక ఆర్డీవో పేర కల్యాణలక్ష్మి అకౌంట్ గల బ్యాంకుకు చేరిన అనెక్జర్లో కొన్ని పేర్లు మారడం వల్ల ఆర్థిక సహాయం మంజూరైన దరఖాస్తుదారులకు కాకుండా ఇతరులకు అందినట్లు సమాచారం.
రెండేళ్ల కాలంలో పర్వతగిరి, గీసుగొండ తదితర మండలాల్లో ఇలా జరిగినట్లు కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఆర్డీవో కార్యాలయం నుంచి బ్యాంకుకు చేరిన అనెక్జర్లో అక్రమార్కులు ఆర్థి క సహాయం మంజూరైన దరఖాస్తుదారుల పేర్ల స్థానం లో ఇతరుల పేర్లు చేర్చడం వల్ల బ్యాంకర్లు ఈమేరకు చెక్కులను తయారు చేయడం, రూ.1,00,116తో కూ డిన ఒక్కో చెక్కును అక్రమార్కులు డ్రా చేసుకున్నట్లు సమాచారం.
ఆర్థిక సహాయం ఎదురుచూసిన దరఖాస్తుదారులు చివరకు తమకు కల్యాణలక్ష్మి పథకం నుంచి ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కొద్దిరోజుల క్రితం ఈ వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. దీంతో ఇలా ఎన్ని మండలాల్లో జరిగింది?, ఎంతమంది దరఖాస్తుదారులపేర మంజూరైన కల్యాణలక్ష్మి పథకం ఆర్థిక సహాయం పక్కదారి పట్టింది? అనే వివరాలను కొద్దిరోజుల నుంచి అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆయా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో ఆఫీసుకు అందిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను, ఆర్థిక సహా యం మంజూరైన దరఖాస్తుదారుల జాబితాలు, ఆర్డీవో కార్యాలయం నుంచి బ్యాంకుకు పంపిన అనెక్జర్లను పరిశీలించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు దరఖాస్తుదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయం ఇతరులకు అందినట్లు తా జా విచారణలో బయటపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్డీవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి పాత్ర ఉందని తేలినట్లు సమాచారం. కొన్ని మండలాల్లో షాదీముబారక్ ఆర్థిక సాయం ఇలాగే పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై డీఏవోను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని బదులివ్వడం గమనార్హం.