కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరోసారి నిధుల వేటలో పడింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలువైన భూముల అమ్మకంతో నిధులు పోగేసుకుంటున్నది. ఇదే క్రమంలో ఓ సిటీలోని మిగిలిన ప్లాట్లకు వచ్చే నెలలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసిన 120 ఎకరాల విస్తీర్ణంలోని ఓ సిటీలో ఇప్పటి వరకు 100 ఎకరాలను 800 ప్లాట్లుగా చేసిన కుడా 12 విడతల్లో విక్రయించింది. ఇందులో మిగిలిన 10 ఎకరాలను మిల్లు కార్మికుల ఇంటి స్థలాల కోసం కేటాయించగా, మరో 10 ఎకరాలను 80 ప్లాట్లుగా చేసి చివరిసారి వేలం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వీటిలో 30 కమర్షియల్, 50 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉండనున్నాయి. రెసిడెన్షియల్ కేటగిరీలో గజానికి రూ. లక్ష, కమర్షియల్కు రూ.1.50 లక్షల చొప్పున కుడా ప్రాథమికంగా ధరను నిర్ణయించినట్లు తెలిసింది.
చారిత్రక వరంగల్ నగరంలో కుడా చేపట్టిన ఓ సిటీ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని కొత్తగా అభివృద్ధి చేసింది. అన్ని వసతులతో ఉండే కాలనీలు, ఇండ్ల సముదాయాలు అప్పటి వరకు హనుమకొండలోనే ఉంటాయనే అభిప్రాయం ఈ ప్రాజెక్టుతో మారిపోయింది. ఈ ప్రాంతం వరంగల్లో ముఖ్యమైనది కావడంతో ఇందులోని ప్లాట్లకు భారీగా డిమాండ్ వచ్చింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్రభుత్వ సంస్థ కావడంతో న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని, బ్యాంకు లోన్లు సులభంగా వస్తాయనే ఉద్దేశంతో ప్లాట్ల కొనుగోలుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈ పోటీ కుడాకు భారీగా నిధులు తెచ్చి పెట్టింది. వ్యాపారులు, ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలకు చెందిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి భారీ, విలాసంతమైన భవనాలు నిర్మించారు.
వరంగల్లో ఉపాధి కేంద్రంగా నిలిచిన అజంజాహీ మిల్లు మూత పడిన తర్వాత దీనికి సంబంధించిన 120 ఎకరాల భూమిని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ నుంచి 2007లో కుడా కొనుగోలు చేసింది. ఎస్బీఐ నుంచి రూ.50 కోట్ల లోను తీసుకుని ఓ సిటీ పేరిట ఖరీదైన ప్లాట్లుగా అభివృద్ధి చేసింది. ఈ వెంచర్లో పార్కులు, మినీ స్టేడియం, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లాంటి మౌలిక వసతులు కల్పించి 2007లోనే తొలిసారి వేలం నిర్వహించింది. అప్పుడు గజం ధర రూ. 3 వేలుండగా, 2022లో 12వ సారి వేలంలో రెసిడెన్సియల్ ప్లాట్ గజం రూ.80 వేలు, కమర్షియల్ రూ. లక్ష పలికింది. ఓ సిటీ ప్రాజెక్టు కుడాకు ఇప్పటికే దాదాపు రూ.400 కోట్లను ఆర్జించి పెట్టింది.