కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపాలైనట్లు అందులో పేర్కొంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ భూముల్లో యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ పార్టీ నేతలు దాదాపు 19 మంది దర్జాగా ఇళ్లు కట్టుకొని నివాసముంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కబ్జాదారుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా అధికార పార్టీ పెద్దలే వారికి అండగా నిలుస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా బల్దియా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. భూములు వెనక్కి తీసుకోకుండా అడ్డుపడుతున్నారు.
– వరంగల్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీ (కేయూ)1976లో ఏర్పాటైంది. నగరంలోని కుమార్‌పల్లిలో 188 ఎకరాలు, లషర్ సింగారంలో 309.20, పలివేల్పుల శివారులో 175.14 చొప్పున 673.12 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రధాన రహదారి వెంట మాత్రమే ప్రహరీ నిర్మించి, యూనివర్సిటీ వెనుక వైపు వదిలేయడంతో పలివేల్పుల, డబ్బాల ఏరియా, ముచ్చర్ల రోడ్డులో ఉన్న భూములు కబ్జాకు గురయ్యాయి. యూనివర్సిటీ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, పోలీసు అధికారులు దర్జాగా కబ్జా చేసి సర్వే నంబర్లలో స్వల్ప మార్పులు చేసి కాగితాలు సృష్టించారు.
కేయూ భూముల కబ్జాపై ఆరోపణలు పెరగడంతో 2023లో హనుమకొండ కలెక్టర్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) పద్ధతిలో భూములను సర్వే చేయించగా ప్రస్తుతం 622.2 ఎకరాలే ఉన్నట్లు తేలింది. కేయూ క్యాంపస్‌లోని 229, 234, 412, 413, 414 సర్వే నంబర్లలోని 51 ఎకరాల భూమి కబ్జా అయినట్లు బయటపడింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరు నెలల క్రితమే సర్కారుకు సమర్పించినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు, ప్రొఫెసర్లు ధర్నాలు చేశారు. అయినా యూనివర్సిటీ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు.
కేయూ భూముల పరిరక్షణ విషయంలో ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం రూ.10 కోట్లు మం జూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పనులు పూర్తి కాలేదు. విద్యార్థుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల 229 సర్వే నంబర్లో పూర్తి సర్వే నిర్వహించి స్థానిక తహసీల్దార్ నివేదిక ఇచ్చారు. ఇందులోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వారు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో 214 సర్వే నంబర్లోని భూములు, అక్రమ నిర్మాణాలను నిర్ధారించే సర్వేను సైతం నిలిపివేశారు. 412, 413, 414 సర్వే నంబర్లలో ఇంకా సర్వేను మొదలుపెట్టలేదు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే పూర్తి చేసి నివేదిక ఇస్తేనే హద్దులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సర్వేకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రహరీ నిర్మాణం ముందుకు సాగడంలేదు. కేయూ భూములకు రక్షణ ఉండడంలేదు.
కాకతీయ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం చేపట్టిన సర్వే ప్రస్తుతం ఆగిపోయింది. తిరిగి మళ్లీ కొనసాగుతుంది. లష్కర్‌సింగారంలో యూనివర్సిటీ భూములకు హద్దులు గుర్తించిప్పటికీ చర్యల విషయంలో మున్సిపల్ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన ఇంచు భూమిని కూడా వదిలిపెట్టేది లేదు. సర్వే లెక తేలిన తర్వాత భూములను స్వాధీనం చేసుకుంటాం.