భీమదేవరపల్లి, మే 15: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే కబడ్డీ క్రీడోత్సవాల కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కనుమరుగవుతున్న కబడ్డీ ఆటను బతికించాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు జరుగుతున్నాయని వివరించారు. నేటి యువత డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, మద్యానికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. యువత దురలవాట్కు బానిసై, ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు.
యువతను క్రీడల వైపు మళ్లించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపాలనే ఉద్దేశంతో గాంధీనగర్ అంబేద్కర్ పొదుపు సంఘం సామాజిక బాధ్యతగా తీసుకుందన్నారు. ఈనెల 23, 24, 25 తేదీలలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రీడలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.20,000, రెండవ బహుమతి రూ. 15000, మూడవ బహుమతి రూ. 10,000 నాలుగవ బహుమతి రూ. 5000 నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు.
క్రీడాకారులకు వచ్చిన అతిథులకు పూర్తి వసతులు కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పొదుపు సంఘం సభ్యులు తాళ్లపల్లి రాజయ్య, కుమారస్వామి, ప్రసాద్, అశోక్, ప్రభాకర్, ప్రభుదాసు, సిగ చిరంజీవి, మంద మహేందర్, గ్రామస్తులు గడ్డం కనకదారి, శివ, కొక్కుల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.