మహబూబాబాద్ : వరంగల్ నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల దాడిని ఖండిస్తూ టీయూడబ్ల్యూజే 143 మహబూబాబాద్ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. కాంగ్రెస్ తీరును తప్పు పడుతూ మీడియా స్వేచ్ఛను కాపాడలన్నారు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు వరంగల్ మడికొండలోని నమస్తే తెలంగాణ యూనిట్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు.
150 మంది యూత్ కాంగ్రెస్ జెండాలతో వచ్చి, పత్రిక ప్రతులను చింపి వేసి దౌర్జన్యం సృష్టించారు. ఆఫీస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నం చేయగా ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బందిని, మహిళని బూతులు తిట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల పై వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరించి, గంటపాటు బీభత్సం సృష్టించారు. చివరికి మడికొండ పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై యూనిట్ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది మడికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.