శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో మరింత విస్తృతం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ శ్రేణుల ద్వారా ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై వారికి వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జిలు గ్రామాల బాట పట్టారు. ప్రతి మండలంలో ఎలక్షన్ ప్రచార కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రారంభించారు. అలాగే వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్టీలో చేరికల పర్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.
వరంగల్, అక్టోబర్ 18(నమస్తేతెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆయా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఒక విడుత తమ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా పర్యటించి తమ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. గత నెల 28న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు నర్సంపేటలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయటంతోపాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్‌తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఖిలావరంగల్‌లోని వాకింగ్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఆయన స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. తమ పర్యటనలతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు.
తెలంగాణ సాధించిన పార్టీగా ఇప్పటికే వరుసగా రాష్ట్రంలో రెండుసార్లు విజయ దుందుబి మోగించి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ మూడోసారి గెలుపొందటం ద్వారా హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించటం మొదలుకుని ప్రచారం వరకు అన్నింటా ముందంజలో ఉంది. విజయమే లక్ష్యంగా పలు శాసనసభ నియోజకవర్గాలకు తమ పార్టీ ఎన్నికల ప్రచార ఇన్చార్జీలను నియమిస్తూ ఈ నెల 12న జాబితా విడుదల చేసింది. జిల్లాలో రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. వరంగల్ తూర్పునకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, నర్సంపేటకు జలవనరుల సంస్థ ఛైర్మన్ వీ ప్రకాశ్‌ను నియమించినట్లు ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 15న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అదేరోజు తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోజు, మరుసటి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధినేత బీ-ఫారాలను అందజేశారు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్‌తూర్పు నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ పార్టీ బీ-ఫారాలను అందుకున్నారు. బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీచేసే అవకాశం కల్పించినందుకు తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ అభ్యర్థులు ప్లాన్ చేశారు. గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలతోపాటు యూత్, మహిళా కమిటీలు, పార్టీ అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా బృందాలను రంగంలోకి దింపారు. ఆయా గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ కమిటీల్లోని సభ్యులు తమ పార్టీ శ్రేణులతో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు అందజేస్తున్నారు. మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గం, మండల, పట్టణ, గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో పార్టీ ఎన్నికల ఆఫీసులను ప్రారంభించి ఇన్‌చార్జీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు తమ పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్‌తూర్పు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎసేతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థి స్వాగతించి వారికి గులాబీ కండువాలను కప్పుతున్నారు. ప్రతిరోజు ఈ చేరికల కార్యక్రమం ఉద్యమంలా నడుస్తోంది.