వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీకి(BJP) భారీ షాక్ తగిలింది. 24వ డివిజన్‌కు చెందిన భజరంగ్ దళ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, గోరక్ష ప్రముఖ్ సంగినేని రాజేష్, 25వ డివిజన్‌కు చెందిన బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడు గొండ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ..బీజేపీ గత 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలను మోసం చేసింది. స్విస్ బ్యాంక్‌లలోని నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.10 లక్షలు వేస్తామని చెప్పి గద్దెనెక్కిన నాయకులు ఈ రోజు దేశంలోని సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.
వరంగల్ తూర్పులో బీజేపీకి చెందిన కీలక నేతలే ఇప్పుడు బీజేపీ వైఫల్యాలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ నాయకులు సీతారాం, సోను, మాజీ డైరెక్టర్ మోడం ప్రవీణ్, యువజన నాయకులు రాజ్ పటేల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.