ములుగు, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. త్వరలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీలో రెండు ఎలక్ట్రీషియన్‌తో పాటు ఒక ప్లంబర్ పోస్టుల నియామకాల్లో పెద్ద ఎత్తున పైరవీలు చోటుచేసుకున్నాయి.
దళారులు, ఉన్నతాధికారుల అండదండలతో ముడుపులు తీసుకొని రాజకీయ పైరవీలతో భర్తీ చేయిస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ కావాలని ఇన్చార్జి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్‌కు లేఖ రాయించారు. దళారులు ఆ అధికారిని ప్రసన్నం చేసుకొని కలెక్టర్ పంపించినట్లుగా ముగ్గురు వ్యక్తుల పేర్లను జోడించి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి నియామక ఉత్తర్వులను పంపించారు.
సంబంధిత ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారు నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తాం.. భవిష్య త్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్‌ను అడిగారు. దీంతో ఆయన తాను చెప్పినట్టు గా ఆ ముగ్గురికి ఉద్యోగాలు కల్పించాల్సిందేనని, లేకపోతే ఇతర ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తానని బెదిరించడంతో చేసేదేమీ లేక ముగ్గురికి ఏజెన్సీ ద్వారా నియామక పత్రాలను అందజేశారు. ప్లంబర్‌గా జాకారం గ్రామ మాజీ సర్పంచ్‌తో పాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరిని ఎలక్ట్రీషియన్లుగా నియమించారు. విషయం బయటికి తెలియడంతో పలువురు నిరుద్యోగులు అధికారులను కలిసి అడిగేందుకు ప్ర యత్నం చేయగా పొంతన లేని సమాధానాలు చెప్తూ దాటవేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
గతంలో భర్తీ చేసిన 32 పోస్టుల్లో సైతం పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో కొందరు అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఈ మూడు ఉద్యోగాల భర్తీ లో దళారులు ఒకో ఉద్యోగానికి రూ. 3లక్షల చొప్పు న వసూలు చేసి కింద నుంచి పైస్థాయి వరకు పంపిణీ చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఇన్చార్జి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తుల రవిని వివరణ కోరగా ప్రస్తుతం నియామకం చేసిన మూడు పోస్టులు అన్‌స్కిల్డ్ పోస్టులు అయినందున ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే భర్తీ చేశామని తెలిపారు.
జనగామ చౌరస్తా: జనగామ జిల్లా కలెక్టరేట్లోని భూ సేకరణ విభాగం యూనిట్ 1లో ముగ్గురు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రిక్రూట్ చేసినట్లు ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన శివలింగయ్యకు నోట్ ఫైల్ సమర్పించకుండా, రోస్టర్ పాయింట్లు పాటించకుండా ముగ్గురికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిసింది. ఈ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంపై భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసినిని వివరణ కోరగా టెంపరరీగా వారిని విధుల్లోకి తీసుకున్నామని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే వారికి వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ కమిషనర్ సూచనల మేరకు గత కలెక్టర్‌కు నోటి మాట ద్వారా ఈ విషయాన్ని చెప్పిన తర్వాతే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రిక్రూట్ చేసుకున్నామని తెలిపారు.