ఖిలావరంగల్, మార్చి 20 : ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల త్యాగ ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల జీవన్ గౌడ్ అన్నారు. గురువారం ఖిలావరంగల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ తొలితరం ఉద్యమకారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణలో భాగంగా చేసిన ఉద్యమాల్లో అనేక ఆటుపోట్లను, కష్ట నష్టాలను ఎదుర్కొన్నారన్నారు.
ఉద్యమ సమయంలో అసువులు బాసిన 23 మంది అమరవీరుల కృషి ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని కొనియాడుతూ ఈ సందర్భంగా వారికి నివాళులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేసినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాదిగ సామాజిక వర్గం విద్యావంతులై ఈ వర్గీకరణ ఫలాలను అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నమిల్ల కుమారస్వామి, గద్దల కుమారస్వామి, పోలేపాక యాదగిరి, ప్రసాద్, లింగాల ఇమ్మానియేల్, కాంపల్లి సతీష్, గద్దల కృష్ణ, యాదగిరి, మాణిక్యం, కాగితల ఎల్లయ్య, దాడిపల్లి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.