
నమస్తే నెట్వర్క్: వచ్చే నెల ఒకటో తేదీన విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం, లక్నేపల్లి పాఠశాలలను జడ్పీ సీఈవో రాజారావు శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కళావతి, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో సునీల్‌కుమార్‌రాజ్ ఉన్నారు. అనంతరం చిన్న గురిజాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీవో పరిశీలించారు. అలాగే, చెన్నారావుపేటలోని జడ్పీఎస్‌ఎస్‌లో శానిటేషన్ పనులను జడ్పీ సీఈవో పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి బాలకృష్ణ, ఎంపీడీవో దయాకర్, ఎంపీవో సురేశ్ ఉన్నారు.
ఖిలావరంగల్ ప్రాంతం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంతోపాటు శివనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ హరిసింగ్ సందర్శించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రిన్సిపాల్ కే శోభాదేవికి సూచించారు. సంగెం మండలంలోని సంగెం, తిమ్మాపురం, తీగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలను డీపీవో ప్రభాకర్ తనిఖీ చేశారు. సర్పంచ్‌లు, హెచ్ఎంలతో సమీక్షించారు. ఎంపీపీ కందకట్ల కళావతి, సర్పంచ్‌లు బాబు, గన్ను శారద, కర్జుగుత్త రమగోపాల్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తీగరాజుపల్లిలో విద్యుత్ పనులను ఎంపీపీ కళావతి ప్రారంభించారు. రాయపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దుగ్గొండి ఎంపీడీవో కృష్ణప్రసాద్ మండలంలోని మందపల్లి, చాపలబండ, రేఖంపల్లి, చలపర్తి, రంగాపురంలోని పాఠశాలల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఎంపీవో శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీపీల ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేస్తున్నారు. గీసుగొండ మండలంలోని ధర్మారం, వంచనగిరి ప్రభుత్వ పాఠశాలలను ఎంఈవో సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కరోనాపై పలు సూచనలు చేశారు. గీసుగొండ మండలంలోని మొగిలిచర్లలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి శారద సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రం చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు.