వరంగల్, ఏప్రిల్ 20(నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుండడం, రైతుల నుంచి యాసంగి వడ్లను కొనుగోలు చేసేందుకు ససేమిరా అనడంపై నిరసన తెలియజేస్తున్న వారిలో కొత్త జోష్ నింపింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి మంత్రి కేటీఆర్ బుధవారం నర్సంపేటకు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నర్సంపేట పర్యటన గంటన్నర మాత్రమే ఖరారైనప్పటికీ రెండు గంటలకు పైగా సమయం కేటాయించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్ ఉల్లాసంగా పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం నర్సంపేటలో నెలకొల్పిన పీఎన్జీ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు మొదటిది కావడం విశేషం. దీని ద్వారా 12,600 ఇండ్లకు తక్కువ ధరపై పీఎన్జీ సరఫరా కానుంది. రూ.1,050 చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ పొందుతున్న వినియోగదారులకు కేవలం రూ.600కే పీఎన్జీ లభించనుందని అధికారులు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కేటీఆర్ వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్న తరుణంలో తక్కువ ధరపై లభించే పీఎన్జీని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
పీఎన్జీ ప్రాజెక్టు ఏర్పాటుతో ఎమ్మెల్యే పెద్ది రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించారని, ఇలాంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ ప్రజలకు దొరకడం అదృష్టమని కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ది పరితపిస్తున్నారని, ఆయన కోరినట్లు నర్సంపేటకు రింగ్‌రోడ్డు, మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రజల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నర్సంపేటలో ఆహార శుద్ధి పరిశ్రమలను కూడా నెలకొల్పుతామని చెప్పారు. నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీల పరిధిలో వీవో భవనాల నిర్మాణం కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకున్న 6,200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే పెద్ది వేతనం, రెడ్-కో సంస్థ సహకారంతో స్టడీ సోలార్ లైట్ సిస్టమ్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలతో పాటు అభయహస్తం కార్పస్ ఫండ్‌ను వడ్డీ సహా రూ.105 కోట్లను చెక్కుల రూపంలో అందజేశారు. ఇటీవల టీఆర్ఎస్ శ్రేణులు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడల విజేతలకూ బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డి, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్‌రావు పాల్గొన్నారు.
నర్సంపేటలో జరిగిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు, ప్రజలు హాజరయ్యారు. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల నుంచి తరలివచ్చారు. కేటీఆర్ సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. కేటీఆర్ పర్యటనతో వెలిసిన కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో నర్సంపేట పట్టణం గులాబీమయమైంది. హనుమకొండలోని కుడా గ్రౌండ్లో జరిగిన మంత్రి కేటీఆర్ సభకు జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, జీడబ్ల్యూఎంసీ డివిజన్ల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, జనం భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.