ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి
చిన్న చెరువులను బలోపేతం చేయాలి
కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి
వరంగల్, మార్చి 9: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధ్యక్షతన బుధవారం జరిగిన చెరువుల సంరక్షణ కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు. గత సమావేశంలో నిర్ణయించిన అంశాల అమలుపై సమీక్షించారు. గ్రేటర్ పరిధిలోని 282, కుడా పరిధిలోని వెయ్యి చెరువులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నవడ్డేపల్లి, భద్రకాళి, బొందివాగు నాలా, కోట చెరువు, వడ్డేపల్లి చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, జియో ట్యాగ్ చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో ముంపునకు గురికాకుండా నీటి పారుదల,రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, అధికారులు వెంటనే నాలా ప్లాన్లను తయా రు చేయాలని సూచించారు. నాలాలకు హద్దులు నిర్ణయించి రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు.
ధర్మసాగర్ క్యాచ్మెంట్ పరిధిలో 350 కిలోమీటర్ల మేర చిన్నచిన్న పరీవాహకాలు ఉన్నాయని తెలిపారు. దేవునూరు ప్రాంతం రిజర్వ్ ప్రాజెక్టు ఏరియా గ్రీన్ జోన్లో ఉన్నందున ఆ ప్రాంతంలో క్వారీలకు అమమతి ఇవ్వద్దని అధికారులను ఆదేశించారు. బఫర్‌జోన్‌లోని భూములకు నాలా బదలాయింపు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. రెడ్డిపురంలోని ఎఫ్ఎస్టీపీ ఏర్పాటుకు తలెత్తిన భూసమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని అన్నారు. భద్రకాళి ఆల య సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వారు పేర్కొన్నారు. ధర్మసాగర్ ప్రాంతంలోని చిన్న చెరువులను బలోపేతం చేయాలని ప్రొఫెసర్ పాండురంగారావు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్‌జీ, ఇండస్ట్రీస్ జీఎం నర్సింహామూర్తి, బల్దియా సీపీ వెంకన్న, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, కుడా పీవో అజిత్‌రెడ్డి, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, నిట్ ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, జయకుమార్ పాల్గొన్నారు.
నిబంధనల మేరకే లేఔట్ అనుమతి
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని భూములకు నిబంధనల మేరకు లేఔట్ అనుమతి జారీ చేస్తామని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి అన్నారు. బుధవారం కుడా కార్యాలయంలో గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధ్యక్షతన టీఎస్- బీపాస్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఎకరాలు, అంతకన్న ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములకు తాత్కాలిక అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తులను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి కలెక్టర్లు పరిశీలించారు. మూడు దరఖాస్తులను పరిశీలించిన వారు రెండింటికి అనుమతి మంజూ రు చేసి ఒక దరఖాస్తును తిరస్కరించారు. గ్రేటర్ పరిధిలోని 10 ఎకరాల లోపు లేఔట్ స్థలాల టైటిల్ డీడ్, టెక్నికల్ వెరిఫికేషన్‌ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేస్తారని వారు అన్నారు.
సైట్ వెరిఫికేషన్‌ను డీటీసీపీ అధికారులు చేసిన అనంతరం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తారని వివరించారు. వాటిని పరిశీలించి మంజూరు లేదా తిరస్కరణ చేస్తారని అన్నారు. ఈ కమిటీకి గ్రేటర్ కమిషనర్ కన్వీనర్‌గా నోడల్ అధికారిగా సిటీ ప్లానర్, గ్రేటర్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఎస్ఈలు సభ్యులుగా ఉంటారన్నారు. తాత్కాలిక లేఔట్ పొందిన వారు రెండేళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. వాటిని పరిశీలించిన కమిటీ శాశ్వత లేఔట్ మంజూరు చేస్తుందన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, ఆర్డీవోలు మహేందర్‌జీ, వాసుచంద్ర, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, కుడా పీవో అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.