కలప మధ్య భద్రపరిచి తరలిస్తుండగా 574 కిలోల పట్టివేత
ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మసాగర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి
సుబేదారి, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నాటక రాష్ట్రానికి లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, ధర్మసాగర్ పోలీసులు పట్టుకున్నారు. కలప మధ్యన ఉంచి తరలిస్తున్న 574 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి బుధవారం వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన మహ్మద్‌ఖాన్ కొయ్యూరు నుంచి కాగితం తయారీకి ఉపయోగించే నీలగిరి కలపను లారీలో లోడ్ చేసుకున్నాడు. నిందితుడు కాశీనాథ్ ఆదేశం మేరకు 574 కిలోల గంజాయిని రెండు కిలోల చొప్పున 287 ప్యాకెట్లలో నింపారు. వాటిని బస్తాల్లో వేసి లారీలో కలప మధ్యన భద్రపరిచి అనుమానం రాకుండా తెలంగాణ మీదుగా కర్నాటకకు తరలిస్తున్నారు. కొత్తగూడ, ఏటూరునాగారం, ములుగు మీదుగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ధర్మసాగర్ పోలీసులు ఔటర్ రింగ్‌రోడ్డు ఉనికిచర్ల టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీ పట్టుబడింది. కలప మధ్యలో ఉంచిన 574 కిలోల గంజాయి లభ్యమంది. గంజాయిని స్వాధీనం చేసుకుని అహ్మద్‌ఖాన్, జాదవ్తుకారాన్ని అరెస్టు చేసి చేశామని సీపీ తెలిపారు. లారీని పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన అడిషనల్ డీసీపీ వైభవ్‌గైక్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్, సంతోష్, ధర్మసాగర్ సీఐ రమేశ్, సిబ్బందిని సీపీ అభినందించారు.