
నర్సంపేట, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని జయశ్రీ టాకీస్‌లో రైతన్న సినిమాను కుటుంబం, నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ చేసిన నల్ల చట్టాల రద్దు కోసం రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నల్ల చట్టాలతో మార్కెట్లు అంతరించిపోతాయని, వ్యవసాయం చేయడం పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని తెలిపారు. రైతులు భూములను కోల్పోయి కూలీలుగా మారే ప్రమాదం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని రైతులకు సూచిస్తూనే, దానికి తగ్గట్టుగా అవగాహన కల్పించడం, విత్తనాలు సమకూర్చడం, మద్దతు ధరలు కల్పించడం వంటివి చేయడం లేదని విమర్శించారు. మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి రైతన్న సినిమాను అద్భుతంగా తీశారని తెలిపారు. రైతుల సమస్యలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నల్లచట్టాలతో రైతుల అస్థిత్వం దెబ్బతింటుందని తెలిపారు. కరెంట్ కోత, మద్దతు ధరలు లేకపోవడం, భూములను కుదువపెట్టడం, ఆత్మహత్యలు వంటివి చూపించారని వివరించారు. ఈ సినిమాను రైతులందరూ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, ఆర్ఎస్ఎస్ నాయకులు, పజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, రైతులు ఈ సినిమాను వీక్షించిన వారిలో ఉన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి రావాలి
నర్సంపేట రూరల్: గురిజాలలో నిర్మించిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి తప్పకుండా రావాలని ఆలయ కమిటీ చైర్మన్ నీలం మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు గుర్రం నర్సింగం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కోదండరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచ్ గొడిశాల మమత, ఆలయ కమిటీ డైరెక్టర్లు గజ్జి రాజు, గడ్డం నర్సయ్య, గుర్రం అచ్చయ్య, గొడిశాల సంపత్, డక్క శ్రీనివాస్, గడ్డం ఆంజనేయులు, అల్లి రవి, పోటు రాయపురెడ్డి, రవీందర్, గొడిశాల సదానందం, వార్డు సభ్యులు ఉన్నారు.