
వర్ధన్నపేట, నవంబర్ 14: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, వారి కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నల్లబెల్లి, బండౌతాపురం, వర్ధన్నపేట పట్టణానికి చెందిన పలువురు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందాడు. బాధిత కుటుంబాలను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం అరూరి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అలాగే, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధి కోసం నిబద్ధతతో పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. పార్టీ కోసం పని చేస్తూ సభ్యత్వాలు తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా విపత్తు సంభవిస్తే వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు పార్టీ రూ. 2 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా పార్టీ కోసం పని చేసే వారికి మంచి అవకాశాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీను, కార్యదర్శి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తల్లి దయతో కరోనా ఖతం కావాలి
పర్వతగిరి: చింతనెక్కొండలో ఆదివారం గిద్దమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు సామూహిక బోనాలను అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దైవ పూజలతో సమాజంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. అమ్మ వారి దయతో కరోనా వైరస్ ఖతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, సర్పంచ్ గటిక సుష్మామహేశ్, ఎంపీటీసీలు మౌనికారాజు, సుభాషిణీవాసు, ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.