Israel strikes : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. లెబనాన్ (Lebanon) లోని బెకా లోయ లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడుల (Air strikes) కు పాల్పడింది. ఈ దాడిలో ఓ సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్‌తో సహా 10 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 2024లో రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
కాగా ఈ ఘటనపై లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. మృతుల్లో సాధారణ పౌరులు కూడా ఉన్నారని, గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారని తెలిపింది. మరణించిన 10 మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడితో బెకా లోయ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఈ దాడిని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
తమపై దాడి చేసేందుకు హిజ్బుల్లా సన్నాహాలు చేస్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. బెకా లోయలోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘటనపై హిజ్బుల్లా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా పరిణామంతో ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.