Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఒక రోజు సమయం కోరినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలోని విటల్ పటేల్ హౌజ్‌లో సీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల మధ్య శుక్రవారం మధ్యాహ్నం చర్చలు జరిగాయి. సీజేపీ తరఫున అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చల్లో పాల్గొన్నారు.
కేంద్రం తరఫున మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. వీరి మధ్య దాదాపు రెండు గంటల వరకు చర్చలు సాగాయి. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో మూడు ప్రధాన డిమాండ్లను సీజేపీ ప్రతినిధులు కేంద్రం ముందు ఉంచారు. వాటిలో ఒకటి ఇటీవలి ఆందోళనలో పాల్గొన్న ప్రతినిధులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు. రెండోది నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం అందించడం. ఈ రెండు ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాకు వెల్లడిచంచారు. అయితే, మరో ప్రధాన డిమాండ్ విషయంలో కేంద్రం సమయం కోరిందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ విషయంలో కేంద్రం ఒక రోజు గడువు కోరిందన్నారు.
ఈ అంశంపై చర్చించి, శనివారం నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్రం పదవి నుంచి తొలగిస్తుందని భావిస్తున్నట్లు సీజేపీ నేతలు చెప్పారు. ఇదే సమయంలో నీట్ నిర్వహణ, పేపర్ లీకేజీ అరికట్టే అంశంపై ఐదు సూచనలు చేసినట్లు చెప్పారు. మరోవైపు సీజేపీ నేతలతో శనివారం మరో దఫా చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి జేపీ నద్దా వెల్లడించారు. కేంద్రం తమ పూర్తి డిమాండ్లు నెరవేర్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని సీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన భవితవ్యం రేపు తేలనుంది.