మహాదేవపూర్, మే 3: అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. శనివారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎర్రజర సమీపంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో అకాల వర్షంతో తడిసి ముద్దయిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిందని చెప్పారు. తడిసిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, మాజీ సర్పంచ్ బాపు, పోత వెంకటస్వామి, ఆన్కారి ప్రకాష్, ఎండీ అలిమ్, రైతులు పాల్గొన్నారు.