న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల వేళ నోయిడాలో సుమారు 12 స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ల వద్ద విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కొందర్ని తరలించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈమెయిల్ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్ని, సిబ్బందిని తక్షణమే తరలించారు. పేరెంట్స్‌కు ఈ విషయాన్ని చేరవేశారు. ప్రభావిత స్కూల్ క్యాంపస్‌ల వద్దకు నోయిడా పోలీసు బృందాలు వెళ్లాయి. బాంబు డిస్పోజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
గురువారం ఢిల్లీలో కూడా మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకలోని సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్, పశ్చిమ్ ఎన్‌క్లేవ్‌లోని డీఏవీ సెంటనరీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను ముందస్తు జాగ్రత్తగా మోహరించారు. పోలీసు, బాంబ్ డిస్పోజల్ బృందాలు, స్థానిక అధికారులు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మెయిల్స్ ఎక్కవ నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు సైబర్ బృందాలను అలర్ట్ చేశారు. ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నది.