మల్హర్, జూలై 07: దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదు అన్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రంథాలయ (Library) పరిస్థితి మారింది. నిరుద్యోగ యువతీ, యువకులకు విజ్ఞాన సముపార్జన కోసం నిర్మించిన ఈ విజ్ఞాన భాండాగారంకు పట్టిన గ్రహణం నాలుగు నెలలు కావస్తున్నా వీడటం లేదు. పర్యవసానంగా ఇరుకు గదిలోనే పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో గత ఏడాది మార్చి నెలలో రూ.25లక్షల నిధులు వెచ్చించి నూతన గ్రంథాలయ భవనం నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. తొమ్మిది నెలల్లో అధునిక హంగులతో పనులు పూర్తి చేసుకుంది. కానీ ప్రారంభంకు నోచుకోలేకపోతుంది.
తద్వారా గ్రంథ పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పాత ఇరుకు గదిలోనే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1989 సంవత్సరం నుంచి తాడిచెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఓ ఇరుకు గదిలో గ్రంథాలయం కొనసాగుతున్నది. ఇక్కడ తాడిచెర్లతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల నిరుద్యోగ యువకులు, విద్యార్థులు వచ్చి అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివి వెళ్తుంటారు. ఇరుకుగా ఉండటంతో చాలా మంది గ్రంథాలయం బయటనే చెట్ల కింద కూర్చొని చదివేవారు. గ్రంథ పాఠకుల విజ్ఞప్తులతో గత ఏడాది తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో విశాలమైన గదులతో నూతన భవనం నిర్మించారు. అది పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ప్రారంభించడం మాత్రం మరిచిపోయారు. గ్రంథాలయం పర్యవేక్షకుడు ప్రభాకర్‌ను వివరణ కోరగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకవెళ్లామని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.