కాటారం: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, చికిత్సకు ఆర్థికస్థితి సహకరించక అవస్థలు పడుతున్న వ్యక్తికి జయశంకర్ ఫౌండేషన్ (Jayashankar Foundation) అండగా నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తోట రవి.. బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు రవి.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
రెండు కాళ్లు కోల్పోవడంతో చికిత్సకు అధికమొత్తంలో డబ్బులు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో చికిత్సకు తోచినంతలో సహకరించాలని రవి కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ.. వారి కుటుంబానికి భరోసా కల్పించారు. రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో అతనికి ఏదైనా షాపు పెట్టించి జీవనోపాధి కల్పిస్తామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.