భూపాలపల్లి : నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద 30 మంది ఎంబీబీఎస్ చదివిన వైద్యుల నియామకానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూ కు నలుగురు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సర్టిఫికెట్లను పరిశీలించి ఇంటర్వ్యూ చేసి వారిని పల్లె దవాఖానాల్లో అవుట్ సోర్సింగ్ పద్దతిలో వైద్యులుగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని, అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సేవ చేయడానికి చాలా అవకాశం ఉందని అన్నారు.
మీ పరిధిలో రోజువారీ వైద్య సేవలతో పాటు మాతా, శిశు సంరక్షణ, సీజనల్, సాధారణ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తులకు సమయానికి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలను పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీరామ్, నేషనల్ హెల్త్ మిషన్ పీవో చిరంజీవి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి డి.సునీత, తదితరులు పాల్గొన్నారు.