వరంగల్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అర్ధశతాబ్దపు ఘోషకు ముగింపు పలుకుతూ.. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంగా సాధించిన తెలంగాణ ఆకాంక్షను పరిపూర్ణం చేస్తూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 95శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తూ.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొలువుల జాతరకు తెరలేపగా జిల్లావ్యాప్తంగా సబ్బండ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఓ వైపు కేంద్ర సర్కారు ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నా.. మనోళ్లు ధీమాతో బతికేందుకు దారిదీపమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లవారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ భర్తీ వివరాలు వెల్లడిస్తుండగా బుధవారం ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయిన లక్షలాది కనులు కృతజ్ఞతను చాటాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాకు ఒకేసారి 842 పోస్టులు, భద్రాద్రి జోనల్ పరిధిలో 2,858, మల్టీ జోనల్లో 6800 పోస్టులు ప్రకటించగానే జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమైంది.
నీళ్లు.. నిధులు, నియామకాలు.. ఇవీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నినాదాలు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటంతో స్వరాష్ట్రం సాకారమైంది. బంగారు తెలంగాణ ప్రదాత కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ ఆకాంక్షలు ఫలిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు నెరవేరుతున్నాయి. యువతకు ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఒకేసారి 91వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. స్వరాష్ట్ర స్వప్నం పూర్తిగా సాకారమైందన్న సంతోషం అందరిలోనూ కనిపించింది.
అవరోధాలను దాటి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచే అనుకున్న విధం గా ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రక్రియ మొ దలైంది. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని నిబంధనలతో కొం త ఆలస్యమైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ, కొత్త జిల్లాల వారీగా ఖాళీల గుర్తింపు, స్థానికులకు ఎక్కువ శాతం ఉద్యోగాల కేటాయింపు వంటి వాటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాన్ లోకల్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే దక్కేలా చేసింది.
వేగంగా నియామకాలు..
టీఆర్ఎస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో వేగంగా నియామకాలు చేపడుతున్నది. దేశంలోనే అత్యంత పారదర్శకంగా పోస్టు లు భర్తీ చేస్తున్న రాష్ట్రంగా పేరుగడించింది. పరిపాలన అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీ చేసేలా నిర్ణయా లు తీసుకున్నది. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80 శాతం వరకు స్థానిక రిజర్వేషన్ పరిధిలో ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు ఇది 95 శాతం అయ్యింది. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్, మల్టీ జోన్లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యం కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ లలో ఐదు శాతం ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం పోటీ పడొచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్లలోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.
భారీగా పోస్టులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు వరంగల్ జిల్లాలో 842 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 95 శాతం జిల్లా యువతకే దక్కుతాయి. జిల్లాతో పాటు మన యువతకు జోనల్ పోస్టుల కోసం నేరుగా అవకాశాలుంటాయి. కాళేశ్వరం జోన్లో 1,630, భద్రాద్రి జోన్ 2,858, యాదాద్రి జోన్లో 2,160 పోస్టులు భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్‌లోనూ 6800 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లా, జోన్, మల్టీ జోన్లతో మన యువతకు ఒకేసారి భారీ సంఖ్యలో పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. స్థానికతకు తోడు ఒపెన్ కేటగిరీలో ఇతర జిల్లాలు, జోన్, మల్టీ జోన్‌లోనూ అవకాశం దక్కనుంది.
సుమారు 1000మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు..
రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల్లోనే ఇలాంటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 2014 జూన్ 2 వరకు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయనున్నారు. ఈ ప్రక్రియలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుమారు 1000మందిదాకా లబ్ధి చేకూరనుంది. కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం లో పని చేస్తున్న అర్హులు ప్రభుత్వ నిర్ణయంతో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు పొందనున్నారు.
ఆగస్టు నుంచే ప్రక్రియ..
జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్విభజనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల కింద విభజించింది. ప్రతి శాఖలోని ప్రతి పోస్టు స్థాయిని ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులోనే పూర్తి స్థా యిలో ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని శాఖల్లో పక పక జిల్లాలను, పక పక జోన్లను కలిపి ఒకో పో స్టును ఆయా యూనిట్ల పరిధిలోకి తెచ్చింది. ఈ కేడర్ ఫిక్సేషన్‌కు అనుగుణంగా ఆయా శాఖల్లో కేడర్ స్ట్రెంత్ ఫిక్స్ ప్రక్రియ మొదలుకానుంది. ప్రభుత్వ శాఖల్లో ఖా ళీలు గుర్తించి భర్తీ చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలకు అనుగుణంగా అన్ని శాఖలకు ఉద్యోగులను సర్దుబాటు చేసింది. అన్ని స్థాయిల ఉద్యోగులను జిల్లా, జోన్, మల్టీ జోన్ వారీగా కేటాయింపు లు చేసింది. ఈ ప్రక్రియ అనంతరం ఖాళీగా ఉన్న పో స్టులను గుర్తించింది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేలా వీటి భర్తీ కోసం సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు
జిల్లా కేడర్ : ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిసెంట్ వరకు జిల్లా కేడర్ కింద గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, సూపర్ వైజర్, మ్యాట్రన్, బార్బర్, రికార్డ్ అసిస్టెంట్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మన్, స్వీపర్, మాలి, శానిటరీ వరర్, ఆయా, ధోబీ, కామాటి, వార్డుబాయ్, స్టోర్ కీపర్, అంగన్వాడీ ఆయా, నర్స్, సిల్డ్ అసిస్టెంట్, గోల్డ్ స్మిత్, ఈవో గ్రేడ్-2, అసిస్టెంట్ ఫోర్మన్, టైం కీపర్, బిల్ కలెక్టర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, బోర్వెల్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పంప్ డ్రైవర్, పబ్లిక్ హెల్త్ వరర్, డార్ రూం, ఎక్స్ రే, ల్యాబ్ అటెండెంట్లు, క్లీనర్, స్ట్రెచ్ బేరర్, థియేటర్ అసిస్టెంట్, టైలర్, లిఫ్ట్ అటెండెంట్, ప్లంబర్, ఫైర్ మన్, యానిమల్ అటెండెంట్ పోస్టులు జిల్లా స్థాయివిగా ప్రభుత్వం ఖరారు చేసింది.
జోనల్ కేడర్ : సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆపై పోస్టులు
మల్టీ జోనల్ : జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులు
ఉత్సాహంగా యువత ప్రణాళికలు..
త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో యువత పక్కా ప్రణాళికలతో సన్నద్ధమవుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇంతకాలం ఎదురు చూసినవారంతా పుస్తకాల దుమ్ము దులుపుతున్నారు. ఎలా ప్రిపేర్ కావాలన్న ఆలోచనలతో కోచింగ్ సెంటర్ల వైపు చూస్తున్నారు.