వాషింగ్టన్: లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్.. అమెరికాలోని ఇల్లినోయి కేంద్రంగా వ్యాపారం చేసే చిన్న బొమ్మల కంపెనీ ఇది. పేరుకు చిన్నదైనా.. ఇది ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లపైనే పోరాటం చేసి ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే కీలక తీర్పులో భాగమై పలువురి ప్రశంసలు అందుకున్నది. ఈ బొమ్మల కంపెనీ తన దిగుమతుల్లో అధిక భాగం చైనా నుంచే చేసుకుంటుంది.
అయితే ట్రంప్ విధించిన టారిఫ్ల భారం కారణంగా ఈ కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ట్రంప్ టారిఫ్లను నిరసిస్తూ ఆ కంపెనీ యజమాని రిక్ వోల్డెన్బర్గ్ మరికొందరితో కలిసి గత ఏప్రిల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసి అనూహ్య విజయాన్ని సాధించారు.
‘ట్రంప్ ప్రభుత్వం సుంకాల పేరుతో నా దగ్గర నుంచి అదనంగా ఎంతో వసూలు చేసింది. మా సొమ్ము మాకిచ్చేయండి. నా దగ్గర నుంచి ఎంత అదనంగా వసూలు చేశారో దాని రికార్డు అంతా నా దగ్గరుంది’ అంటూ కంపెనీ యజమాని రిక్ వోల్డెన్ బర్గ్ ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘నేను చేసింది రాజకీయ పోరాటం కాదు. ఇది పన్నుల గురించి చేసింది మాత్రమే. ఇప్పటికే అమెరికా పౌరులు ఎంతో మొత్తాన్ని అదనంగా కట్టారు. అదంతా వారికి ఇవ్వాల్సిందే’ అని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో సరైన పక్షంలో నిలబడినందుకు తాము సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు.