పెరుగు : ఒక కప్పు, శనగపిండి : ఒక కప్పు గరం మసాలా : అర టీస్పూన్, కారం : అర స్పూన్, గోధుమపిండి : ఒకటిన్నర కప్పు , పప్పు (ఏదైనా) : ఒక కప్పు , టమాటాలు : రెండు , ధనియా, జీరా పొడి : ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున , కొత్తిమీర : పావు కప్పు , ఉల్లిపాయ : ఒకటి, దాల్చిన చెక్క : అర అంగుళం , లవంగాలు : ఐదు
పసుపు : చిటికెడు, బిర్యానీ ఆకులు : రెండు
మిరియాలు : పావు టీస్పూన్ , జీలకర్ర : అర టీస్పూన్
సోడా ఉప్పు : చిటికెడు , నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : వేయించడానికి సరిపడా, ఉప్పు : రుచికి తగినంత
ఉల్లిగడ్డను సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. శనగపిండిలో తగినంత ఉప్పు, కారం, సోడా ఉప్పు, ధనియా, జీరాపొడితోపాటు ఉల్లిపాయల తరుగు కూడా వేసి.. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి, పిండితో గుండ్రటి పునుగుల్లాగా వేసుకోవాలి. మరోవైపు, పెరుగులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి.. మజ్జిగలా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, పసుపు వేసి కలియబెట్టాలి. ఈ మజ్జిగ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. వేయించిన పకోడీలను ఇందులో వేసి, ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యితో పోపు పెట్టుకోవాలి.
ఇందుకోసం ఒక మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కారం, గరం మసాలా వేసి.. బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మజ్జిగలో తిరగమాత పెట్టుకుంటే.. సింధీ స్టయిల్ కడి సిద్ధమైనట్లే! ఇక పరాటాల కోసం.. ఏదైనా ఓ పప్పును మెత్తగా ఉడిచించుకోవాలి. టమాటాలను మిక్సీ పట్టి, పప్పులోనే వేసి, బాగా కలుపుకోవాలి. ఇందులోనే గోధుమపిండి, ధనియా, జీరాపొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, చపాతీ పిండిలా చేసుకోవాలి. మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని రొట్టెలు ఒత్తుకోవాలి. ఇష్టాన్ని బట్టి నూనె లేదా నెయ్యితో పెనం మీద కాల్చుకుంటే సరి! సింధీ కడీతో కలిపి దీన్ని ఆరగిస్తే.. ఆత్మా రాముడు ‘ఆహా!’ అనాల్సిందే!