చిట్యాల, ఫిబ్రవరి 09 : ద్విచక్ర వాహనం అదుపుతప్పి(Bike accident) యువకుడు మృతి(Young man died) చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రం శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచవరం మండల కేంద్రానికి చెందిన చెవుల శ్రీనివాస్(24) గత రెండేళ్లుగా చిట్యాల మండల కేంద్రం శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని గురువారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని కిరాయి ఉంటున్న ఇంటికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో బైక్ అదుపుతప్పి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు చిట్యాల సివిల్ దవఖానాకు అంబులెన్సులో తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. గత నాలుగు నెలల క్రితమే శ్రీనివాస్ తల్లి మృతి చెందడం విషాదకరం. మృతుడికి సోదరి, తండ్రి ఉన్నారు.