సోదరుడిగా బతుకమ్మ చీరెలు ఇస్తున్న సీఎం కేసీఆర్
కరోనాతో ఆదాయం తగ్గినా సంక్షేమం ఆపలె
త్వరలోనే 57ఏళ్లు నిండిన వారికి పింఛన్లు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, వెలికట్టలో మహిళలకు చీరెల పంపిణీ
బతుకమ్మలతో ఘనస్వాగతం పలికిన ఆడబిడ్డలు
మహిళలతో కలిసి కోలాటమాడిన మంత్రి, కలెక్టర్
తొర్రూరు, అక్టోబర్ 3 : ఆడబిడ్డలు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే తోబుట్టువుగా సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన కలెక్టర్ శశాంకతో కలిసి తొర్రూరు మున్సిపల్ కేంద్రం, వెలికట్ట గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు, కల్యాణలక్ష్మి చెక్కులు, మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు మహిళలు వారికి బతుకమ్మలు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో జరుపుకునే అన్ని పండుగలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి, మన సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
ఆడబిడ్డలు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే సోదరుడిగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు ఇస్తున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం తొర్రూరు మున్సిపల్ కేంద్రం, వెలికట్ట గ్రామంలో చీరెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రితోపాటు కలెక్టర్ శశాంకకు కోలాటాలు, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. వెలికట్టలో తహసీల్దార్ వేంరెడ్డి రాఘవరెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన 12 అడుగుల బతుకమ్మ ఆకర్షణగా నిలిచింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వెలికట్ట సర్పంచ్ పుష్పలీల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, మహిళా సంఘాలకు రుణాల జారీ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా, ఆడబిడ్డలకు అన్నలా అండగా ఉన్నారని అన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షానూట పదహార్లు, బతుకమ్మ పండుగ పూట చీరెలు ఇస్తూ గౌరవిస్తున్నారని అన్నారు. పండుగల సందర్భంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని ప్రతి మహిళకూ బతుకమ్మ చీర అందే విధంగా కృషి చేయాలన్నారు. బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంతో చేనేత కార్మికులకు సంవత్సరమంతా చేతినిండా పని దొరుకుతున్నదన్నారు. తొర్రూరును రూ.11.25 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి జిల్లాలో నంబర్ వన్‌గా పట్టణాన్ని తీర్చిదిద్దామన్నారు.
అమ్మాపురం రహదారుల అభివృద్ధి, కంఠాయపాలెం డబుల్ రోడ్డు, హరిపిరాల రోడ్డులో మోడల్ మార్కెట్, యతిరాజారావు పార్కు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. కరోనా సోకిన వారిని స్వయంగా ఆదుకునేందుకు తన ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు, మాస్కులు అందించామని, తన సొంత నిధులతో అంబులెన్స్‌లు సమకూర్చినట్లు చెప్పారు. కరోనా సమయంలో రూ.50లక్షలతో ఆనందయ్య మందును కూడా ప్రజలకు పంపిణీ చేశామన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 57ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. తొర్రూరు మండలంలో మొత్తం 27వేల మందికి బతుకమ్మ చీరెలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ వేంరెడ్డి రాఘవరెడ్డి, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి, వెలికట్ట ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ పాల్గొన్నారు.