కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి
సమీక్షలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశాలు
మార్చి 28 నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
భూపాలపల్లి రూరల్, ళైబవరి 21 : కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మార్చి 1న మహా శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు మూడు రోజులు కాళేశ్వర ముక్తీశ్వరాలయ ఆవరణలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిసారిలాగే కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టి ఐదు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. కార్మికులను నియమించుకొని పారిశుధ్య పనులను పగడ్బందీగా చేయాలన్నారు. మూడు ప్రాంతాల్లో వాహన పార్కింగ్లు ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖ, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని, భక్తులు గోదావరి నది లోతట్టు ప్రాంతానికి వెళ్లకుండా జాలి ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేయాలని, రెవెన్యూశాఖ వారు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తులకు వైద్యసేవలు అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేయాలని, స్థానిక ప్రజలకు, వ్యాపారులకు లబ్ధి చేకూరేలా అధికారులు సహరించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగుల కోసం దేవస్థానం వరకు ఆటోలు నడిపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా మహా శివరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్‌పూర్ ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ అరుణ, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, ఇరిగేషన్ డీఈ తిరుపతిరావు, విద్యుత్ శాఖ డీఈ నాగరాజు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి, మహాదేవ్‌పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.