నర్సంపేట, మార్చి 2: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మహిళా ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీలను శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. గురు, శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. క్రీడల రిజిస్ట్రేషన్ కోసం మండలాల్లోని ఏపీఎం, సీసీలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొనే మహిళలకు సరైన వసతి కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలోని ఏపీఎంలు, సీసీలు మండల సహకార సమాఖ్య సీఏల సహకారంతో టీంలకు అవగాహన కల్పించాలన్నారు. మండలానికి ఐదు వందల చొప్పున పాల్గొనేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8వ తేదీల్లో మండలస్థాయి క్రీడలు, 9, 10వ తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ఫైనల్ పోటలు జరుగుతాయని వెల్లడించారు. నెక్కొండలో విద్యోదయ హైస్కూల్, చెన్నారావుపేట సిద్ధార్థ హైస్కూల్, నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖానాపురం మండలం బుధరావుపేట హైస్కూల్, నల్లబెల్లి కారుణ్య జ్యోతి హైస్కూల్, దుగ్గొండిలోని స్పోర్ట్స్ క్లబ్లో క్రీడోత్సవాలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన మహిళలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, డీఆర్డీవో సంపత్‌రావు, డీఎస్వో ఇందిర, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఏపీఎంలు, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు, పీఈటీలు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి కృషి చేయాలి
అందరూ సమష్టిగా పని చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోర్టల్‌ను క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ రీ అక్రిడేషన్‌లో మంచి ర్యాంకు రావడానికి సౌకర్యాలను సమకూర్చుతానన్నారు. కళాశాల అకడమిక్ పరంగా అధ్యాపకులు కూడా విద్యను అందించాలని కోరారు. ఇందులో భాగంగా కళాశాల ఫీడ్ బ్యాక్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, పని చేస్తున్న అధ్యాపకులు, పిల్లల తల్లిదండ్రులు ఫీడ్ బ్యాక్‌లో పాల్గొని కళాశాలకు కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కళాశాల పనితీరు, మౌలిక వసతులను ఎప్పటికప్పుడు ఈ ఫీడ్ బ్యా క్ పోర్టల్ ద్వారా తెలుపాలని కోరారు. ప్రిన్సిపాల్ చంద్రమౌళి మాట్లాడుతూ కళాశాలల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ శివనాగ శ్రీనివాస్, పూర్ణచందర్ పాల్గొన్నారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటా: పెద్ది
నెక్కొండ: ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని సూరిపల్లి సర్పంచ్ సింగారపు గీతాభాస్కర్, ఉప సర్పంచ్ సుక్క ఐలయ్యతోపాటు పలువురు వార్డు సభ్యులు, వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీను వీడి నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. వేసవిలోగా సూరిపల్లిలో అరకిలో మీటర్ మేర సీసీరోడ్లను మంజూరు చేయిస్తానన్నారు. త్వరలో రాంపూర్ బీటీరోడ్డు పనులను ప్రారంభిస్తామన్నారు. టీఆర్ఎస్ చేరిన వారిలో గడ్డం రాజు, పోచాల సుధాకర్, పిట్టల భాస్కర్, బత్తిని సారంగం, బొల్ల ఎల్లయ్య, మంగ ఉమేశ్, సల్వాది సుజాతతోపాటు వంద మంది ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, మండల నాయకులు గాదె భద్రయ్య, గుంటుక సోమయ్య, కట్కూరి నరేందర్‌రెడ్డి, దొనికెన సారంగం పాల్గొన్నారు.