టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలు, సభల విజయవంతం కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నర్సంపేట మున్సిపాలిటీ, దుగ్గొండి, నల్లబెల్లి మండల స్థాయి సమావేశాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ టీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటనకు అధిక సంఖ్యలో హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హనుమకొండలో జరిగే మంత్రి కేటీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు.
వరంగల్, ఏప్రిల్ 18(నమస్తేతెలంగాణ) : మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షుడు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలను సిద్ధం చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు ఆయన చేరుకుంటా రు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అధికారులు హెలిపాడ్‌ను రెడీ చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్‌కు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం మంత్రి నర్సంపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్న మెప్మా, గ్రంథాలయ భవనాలను ప్రారంభిస్తారు. నర్సంపేట నియోజకవర్గంలోని 146 గ్రామా ల్లో కొత్తగా మహిళా సమాఖ్య(వీవో) భవనాల నిర్మా ణం కోసం స్థలాల కేటాయింపు పత్రాలను పంపిణీ చేస్తారు. పట్టణంలో మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనులు, వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మెగా కంపెనీ ఆధ్వర్యంలో నర్సంపేటలో నిర్మించిన ఇంటింటికి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభిస్తారు. చివరగా నర్సంపేటలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు వేడుకల్లో కేటీఆర్ పాల్గొంటారు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఉత్సవాల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేస్తారు.
నర్సంపేట పట్టణంలో జరిగే మంత్రి కేటీఆర్ పర్యటన సక్సెస్ కోసం సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. నర్సంపేట మున్సిపాలిటీ, దుగ్గొండి, నల్లబెల్లి మండల స్థాయి సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ రావడానికి ముందుగానే నర్సంపేటకు చేరుకోవాలని, ఆయన పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలు, సభను విజయవంతం చేయాలని పెద్ది పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా నర్సంపేటలో మహిళా సంఘాల ప్రతినిధులతోనూ సమావేశం నిర్వహించారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించారు. నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం మండల స్థాయి సన్నాహక సమావేశాలు జరిగాయి. టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ మండల, గ్రామ, వార్డు కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొని బు ధవారం నర్సంపేటలో జరిగే మంత్రి కేటీఆర్ పర్యటనకు పెద్ద ఎత్తున తరలివెళ్లాలని నిర్ణయించారు. అం తర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు సభ జరిగే గ్రౌండ్లో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టారు.
నర్సంపేట పర్యటన తర్వాత మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లాకు చేరుకుంటారు. సాయంత్రం హనుమకొండలోని కుడా గ్రౌండ్లో జరిగే మంత్రి కేటీఆర్ సభకు జిల్లాలోని వరంగల్‌తూర్పు నియోజకవర్గంతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలో నుంచి కూడా జన సమీకరణ కోసం టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ టీఆర్ఎస్ వరంగల్‌తూర్పు నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కుడా గ్రౌండ్లో జరిగే హనుమకొండ, వరంగల్ జిల్లాల సభకు ఐదు వేల మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ నెల 20న హనుమకొండలో జరిగే మంత్రి కేటీఆర్ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పారు.