మహబూబాబాద్, ఏప్రిల్ 18 : దళితులు ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాతో జీవించాలనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని నందనా గార్డెన్లో పథకం కింద జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు, ఇల్లందులోని గార్ల, బయ్యారం, ములుగులోని కొత్తగూడ, గంగారం, పాలకుర్తిలోని పెద్దవంగర, తొర్రూరు మండలాలకు సంబంధించి మొత్తం 79 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. తొలుత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, హరిప్రియానాయక్తో కలిసి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కే శశాంక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మరో 15 రోజుల్లో ఒక్కో నియోజకవర్గానికి మరో 1500 యూనిట్లు అందజేస్తామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.150 కోట్లు, ఒక్కో ఊరికి రూ.కోటి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే బీసీల కోసం ప్రత్యేక పథకం తీసుకొచ్చేందుక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారి పాలన వారు చేసుకునేలా చేశామన్నారు. రైతుల కోసం 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్రం మాత్రం మోటర్లకు మీటర్లు అమర్చి ఏడాదికి రూ.70వేలు వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. పక్కనున్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం 5 గంటల కరెంట్ అందిస్తే రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నదని వివరించారు.
సీఎం కేసీఆర్ దళితుల పాలిట ప్రత్యక్ష దేవుడని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో అత్యధికంగా దళిత నిరుపేదలున్న విస్సంపల్లికి 80 యూనిట్లు కేటాయించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దళితబంధు పథకంతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ దళితులు ఆర్థిక సాధికారత పొందేందుకే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి దళిత కుటుంబం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందన్నారు. బయ్యారం మండలం గౌరారంలో దళితబంధు కార్యక్రమంలో కలెక్టర్‌తో కలిసి అవగాహన కల్పించే సమయంలో వారి కష్టా లు తెలిశాయని చెప్పారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ దళితబంధు పథకం దళితుల్లో ఆర్థిక పురోభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ములుగు నియోజకవర్గానికి 100కు తగ్గకుండా యూనిట్లు ఇవ్వడం మంత్రి సత్యవతి మంచితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్లు కాసీం, మహబూబ్ పాషా, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
దళితవాడలను అభివృద్ధి చేయాలనే కేసీఆర్ ఆలోచన గొప్పది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం. దళితుల గురించి ఇదివరకు పట్టించుకున్నోళ్లే లేరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఎన్నో ఏండ్లు పేదరికంలో మగ్గినం. కేసీఆర్ దయవల్ల దళితబంధుతో ట్రాక్టర్‌కు యజమాని అయ్యా. దళితులు గర్వంగా బతికేలా మంచి పథకం పెట్టారు. అ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధిస్తాం.
– ఆరెపల్లి అనిల్, అమనగల్
అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా కేసీఆర్ దళితుల బతుకులను బాగుచేస్తుండు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో మంచిగుండాలె. తెలంగాణల నిరుపేద దళితుల అభివృద్ధి కోసం ఇంకా పథకాలు తెవాలె. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ముమ్మలను పట్టించుకోలేదు. మా వాడలను అభివృద్ధి చేయలేదు. సీఎం కేసీఆర్ వల్లే దళితులకు మంచిరోజులు వచ్చినయ్. ప్రతిపక్ష నాయకులు నోరు మూతపడేలా తెలంగాణలో దళితబంధు అమలవుతోంది.
– తప్పెట్ల వెంకన్న, మల్యాల
సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలబెట్టిండ్రు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుండ్రు. గత పాలకులు దళితులను కేవలం ఓట్ల కోసం వాడుకున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో ఇయ్యాల దళితవాడలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వచ్చినయ్. ప్రతి దళితబిడ్డ సీఎం కేసీఆర్‌కు అండగ ఉండాలె. బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలె.
– ఇనుగుర్తి శ్యామ్ కుమార్,
దళితబంధు.. కేసీఆర్ మానసపుత్రిక అని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యంత్రి ఈ పథకం తీసుకొచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ. 17,700 కోట్లు ప్రవేశపెట్టి దళితులపై ఉన్న మక్కువను చాటుకున్నారని తెలిపారు. జిల్లాలోని 305 దళిత కుటుంబాల అకౌంట్లలో రూ. 30.50 కోట్లు ప్రభుత్వం నిల్వ ఉంచిందన్నారు.
సీఎం కేసీఆర్ దళితులకు రూ.10లక్షలు ఇస్తున్నారని, కేంద్రలో అధికారంలో ఉన్న మోదీ బీసీల అకౌంట్లలో రూ.20 లక్షలు వేసి మాట్లాడాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో 17,500 యూనిట్లు కేటాయిస్తే ఎన్నికల కోసం ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయని.. మరి ఇవ్వాల రాష్ట్రమంతటా అమలుచేస్తున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.