ఖానాపురం, సెప్టెంబర్ 8: పాకాల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పాకాల సరస్సు అలుగు పోస్తుండడంతో బుధవారం ఆయన జలాశయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకాల రైతుల అభివృద్ధి కోసం గోదావరి జలాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుకు అనుమతి లేవంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసి అడ్డుకునే ప్రయత్నం చేసారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కేంద్రం జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారన్నారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. ఏపీ సర్కారు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ గుర్తించిందన్నారు. ప్రాజెక్టును ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ నిర్ణయం ప్రతిపక్షాలకు చెంపపెట్టు అన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కే వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమారాణి, సర్పంచ్ గొర్రె కవిత, ఉపేందర్‌రెడ్డి, రవి, తిరుపతిరెడ్డి, బాబురావు, ఎల్లయ్య, వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్‌స్వామి పాల్గొన్నారు.
పాకాలకు జలకళ
పాకాల సరస్సు పూర్థిస్థాయి నీటిమట్టం 30.2 అడుగులకు చేరుకుని మత్తడి పరవళ్లతో కనువిందు చేస్తున్నది. సరస్సు పూర్థిస్థాయిలో నిండితే వానకాలంలో 29,516 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. యాసంగిలో నీటి లభ్యతను అనుసరించి 5 నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాకాల సరస్సు 2018లో ఆగస్టు 23న, 2019లో ఆగస్టు 19న, 2020లో ఆగస్టు 11న, ఈ సంవత్సరం సెప్టెంబర్ 8న అలుగు పోయడం విశేషం. దీంతో రైతులు మూడేళ్లుగా రెండు పంటలు పండిస్తున్నారు. పాకాలకు శాశ్వత జలవనరులతో పాటు త్వరలోనే పంట కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వానికి రూ. 230 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.