
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు రెచ్చిపోయి విమర్శలు చేస్తే ప్రజలు మెచ్చుకోరని మా జీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన ఆపార్టీల నేతలు ఉనికి కోసం టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రైతులకు అందిస్తున్న ఉచిత్ విద్యుత్‌ను చూసి పార్లమెంటులో కేంద్రం అభినందించిందని తెలిపారు. కానీ రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దీనిని గమనించకుం డా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మాట్లాడితే బాగుంటుందని శ్రీహరి హితవు పలికారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, దేశమే విస్తూపోయేలా రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. రైతును రాజు చేయాలని, వ్యవసాయాన్ని పండు గ చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారని, ఐకేపీ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించారని, సబ్సిడీపై ట్రాక్టర్లు, పనిము ట్లు అందిస్తున్నారని వివరించారు.
సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచడం మామూ లు విషయం కాదన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం హైదరాబాద్, వరంగల్ నగరాలకు వెళ్లే రైతులు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుండడంతో వలసలు తప్పాయని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి కోసం ప్రజలు గోసపడ్డారని, ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని, దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అభినందించిందని శ్రీహరి వివరించారు.