
ములుగురూరల్, ఆగస్టు 28: ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో పులి సంచరించినట్లు పుకార్లు వచ్చాయి. కానీ పులి సంచారం ఉందా..? లేదా..? అనే ది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, పెగడపల్లి గ్రామస్తులు ముసలి మడుగు అటవీ ప్రాం తంలో పెద్దపులి అడుగులు చూశామని తెలుపుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో అనిల్ అనే వ్యక్తి ఫొటోలను పోస్టు చేశాడు. ఈ మేరకు ‘నమస్తేతెలంగాణ’ అనిల్‌ను సంప్రదించగా వివరాలను వెల్లడించారు.
మూడు రోజులు గా గ్రామంలోని 60 ఆవులను పశువుల కాపరి మేతకోసం కొ త్తూరు గ్రామంలోని దేవునిగుట్ట వైపు తీసుకెళ్లాడని, గుట్ట దాటి ఐదు కిలోమీటర్ల దూరంలో ముసలిమడుగు(ముసలివాగు) వర్షం కారణంగా ప్రవహిస్తుండడంతో దాటే క్రమంలో కాపరి తప్పిపోయి ఇంటికి వచ్చాడని చెప్పాడు. పశువుల కోసం శనివారం ఉద యం తనతో పాటు గ్రామానికి చెం దిన లక్ష్మీనారాయణ, కుమార్, స్వా మి, రాజు, ముత్యాల నారాయణ, రాజయ్య, సతీశ్, కిరణ్ వాగు వద్దకు వెళ్లి పశువులను వెతుకుతున్న క్రమం లో కనిపించాయని, అందులో మూడు లేగదూడలు కనిపించలేదని తెలిపారు. తిరిగి వస్తుండగా వాగు వద్ద పులి బెదురును గమనించి చూడగా, నేలపై అడుగులు కనిపించాయని, వాటిని ఫొటోలు తీశామని పేర్కొన్నారు. తమ లేగదూడలను పులి తిని ఉండొచ్చని కాపరులు భావిస్తున్నారు.
అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దు
పెగడపల్లి, రాయినిగూడెం, సర్వాపురం, అంకన్నగూడెం, జగ్గన్నగూడెం గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంవైపు వెళ్లొద్దు. సంఘటన స్థలానికి వెళ్లి అడుగులను పరిశీలించిన తర్వాత అవి పులి అడుగులేనా..? కాదా..? మరో జంతువు అడుగులా..? అనేది నిర్ధారిస్తాం. అప్పటి వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఫారెస్టు సిబ్బందిని అప్రమత్తం చేశాం. -సృజన, ఎఫ్ఆర్వో, ములుగు