నర్సంపేట, ఆగస్టు 28: రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం 55 రైతు కుటుంబాలకు రైతుబీమాకు సంబంధించిన రూ. 2.75 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబీమా పథకం యావత్ తెలంగాణ రైతాంగానికి భరోసానిస్తుదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల నుంచి కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందున్నదన్నారు. ఇప్పటివరకు నర్సంపేట నియోజకవర్గంలో రైతుబీమా పథకంలో 494 మందికి రూ. 240.70 కోట్లు అందించిందని వెల్లడించారు. బాధిత కుటుంబాలు సమాజంలో గౌరవంగా బతికేలా ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నదని కొనియాడారు. రైతులు అధునాతన విధానాలతో అధిక దిగుబడి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆర్ఎస్ఎస్ డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ వార్డు సభ్యురాలు
నర్సంపేట రూరల్: పాతముగ్ధుంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు సభ్యురాలు సుంకరి మమత-రాజు దంపతులు ఎమ్మెల్యే పెద్ది సమక్ష్యంలో టీఆర్ఎస్లో చేరారు. పెద్ది వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు అలువాల స్వామి, గోపగాని రాజ్‌కుమార్‌తో పాటు మరో ఆరుగురు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి లావణ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సయ్యద్ బషీర్, కార్యదర్శి పోలెపల్లి రమేశ్, పార్టీ సీనియర్ నాయకులు సుంకరి సాంబయ్య, నాంపెల్లి మల్లయ్య, ననుమాస రాములు పాల్గొన్నారు.