
దేవరుప్పుల, ఆగస్టు 25 : మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషిచేస్తోంది. ఈమేరకు వివిధ పథకాల ద్వారా ఉపాధి కల్పిస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో వారు చేస్తున్న వృత్తులనే సమర్థవంతంగా చేసేలా మెళకువలు నేర్పిస్తూ ఆదాయ మార్గం చూపుతోంది. ఇందులో భాగంగా గ్రామాల్లో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నది. వాటి ద్వారా పలు ఉత్పత్తులు తయారు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన రుణం కూడా ఇస్తున్నది. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారి నుంచి నిష్ణాతులను ఎంపిక చేసి యూనిట్లు అప్పగిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ఎంపిక ప్రక్రియ పూర్తికాగా త్వరలో 324 మందికి రూ.40వేల రుణం మంజూరు కానున్నది. ఈ యూనిట్లలో కారంపొడి, అల్లం వెల్లు ల్లి పేస్ట్, పల్లి పట్టిలు, ఇతర తినుబండారాలతో పాటు కొవ్వొత్తుల తయారీ, కుటీర పరిశ్రమ లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ.. ఇలా గ్రామాల్లో నడి చే ఉత్పత్తులకు ప్రభు త్వం ఆర్థికసాయం అందిస్తున్నది.
ఏ మండలంలో ఎన్ని యూనిట్లు
జిల్లాలోని 12 మండలాల్లో 324 యూనిట్లు నెలకొల్పనున్నారు. బచ్చన్నపేటలో 27 యూనిట్లకు గాను రూ.10.8 లక్షలు, చిల్పూరు 30 యూనిట్లు ఎంపిక కాగా రూ. 12 లక్షలు, దేవరుప్పులలో 12 యూనిట్లు రూ.4.8 లక్షలు, స్టేషన్‌ఘన్‌పూర్ 35 యూనిట్లు రూ. 14 లక్షలు, జనగామ 13 యూనిట్లు రూ. 5.2 లక్షలు, కొడకండ్ల 14 యూనిట్లు రూ. 5.6 లక్షలు, లింగాల ఘనపురంలో 18 యూనిట్లు రూ. 7.2 లక్షలు, నర్మెటలో 43 యూనిట్లు రూ. 17.2 లక్షలు, పాలకుర్తి 41 యూ నిట్లు రూ.16.15 లక్షలు, రఘునాథపల్లి 43 యూనిట్లు రూ. 17,2 లక్షలు, తరిగొప్పుల 15 యూనిట్లు రూ. 6లక్షలు, జఫర్‌గఢ్ 36 యూనిట్లు రూ.14.4లక్షలు కేటాయించారు.
జిల్లాకు రూ.1.30 కోట్లు
జనగామ జిల్లాలో మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆయా కుటుంబాలు స్ధిరపడేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే రూ.1.30 కోట్లు విడుదల చేసింది. కాగా ఈ డబ్బుతో జిల్లాలోని 12 మండలాల్లో ఎంపిక చేసిన 324మంది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అధికారులు ముందుకుపోతున్నారు. ఇందుకనుగుణంగా గ్రామాల్లో పరిశ్రమలు, చేతి వృత్తుల్లో నిష్ణాతులైన మహిళలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వీరంతా వారి వారి వృత్తులపై అనుభవం ఉన్న వారే కాగా ఒక్కొక్కరికి రూ.40వేలు అందించి కుటీర పరిశ్రమల విస్తరణకు అధికారులు సహకరిస్తారు. అవసరమైతే మార్కెటింగ్ వసతులు క ల్పించి ఉత్పత్తులు విక్రయించేందుకూ సహకరిస్తారు.
మహిళలకు ఆర్థిక తోడ్పాటు
మహిళలు తమ ఇంట్లోనే స్వయంఉపాధి పొంది ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. వృత్తిలో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసి వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు అవకాశం ఉంది. జిల్లాలో ఈ పథకం ద్వారా 324మంది ఉపాధి పొందుతారు. ఆ తర్వాత మరికొందరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దశలవారీగా రుణం పెంచి ఎక్కువ మందికి ఉపాధి చూపాలని కలెక్టర్ భావిస్తున్నారు.
వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు..
గతంలో ఐకేపీ మహిళా సమాఖ్య ఇచ్చిన రుణంతో కారంపొడి, అల్లం పేస్ట్, పిండిగిర్ని వంటివి పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నా. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద అధికారులు రూ.40వేలు మంజూరు చేశారు. వ్యాపారాన్ని మరింత విస్తరించే వెసులుబాటు దొరికింది. ఈ రుణంతో నేను తయారు చేసే వస్తువులు ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేస్తాను. అలాగే ఈత చీపుర్లు, ఈత చాపలు అల్లి అమ్మేందుకు సిద్ధం చేస్తున్నా. ఇప్పటికే వ్యాపారంలో మెళకువలపై ఐకేపీ వాళ్లు శిక్షణ ఇచ్చారు. ఐకేపీ రుణం వల్ల మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటోంది.