
వరంగల్, ఆగస్టు 25: స్మార్ట్‌సిటీ పనులను వేగంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్లో బుధవారం ఇంజినీరింగ్, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్మార్ట్‌సిటీ పనుల పురోగతిపై చర్చించారు. స్మార్ట్‌సిటీ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. జాప్యం చేస్తే ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలన్నారు. స్పందించకుంటే జరిమానా విధించాలని ఆదేశించారు. రాంపూర్ డంపింగ్ యార్డు వద్ద రూ. 36 కోట్లతో చేపట్టే బయో మైనింగ్ ప్రాజెక్ట్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఉర్సు చెరువులో 5 ఎంఎల్డీ, బంధం చెరువులో 15 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీల నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. రెడ్డిపురంలో 100 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. స్మార్ట్‌సీటీ ఫేజ్-1లో నిర్మితమయిన రోడ్ నంబర్-4ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్-2 సెప్టెంబర్ నాటికి, రోడ్-1 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లు, చాంబర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జంక్షన్ల విస్తరణలో భాగంగా కొన్ని చోట్ల డ్రెయిన్లు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాల్లో వస్తున్న సమస్యల పరిష్కారానికి ఏజెన్సీలకు సహకరించాలని అధికారులు కోరారు.
ఏజెన్సీలకు నోటీసులు..
నగరం నలువైఫులా గ్రాండ్ ఎంట్రెన్స్‌ల నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ ఏజెన్సీలకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆధికారులను ఆదేశించారు. అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్-ములుగు రహదారిపై నిర్మించే గ్రాండ్ ఎంట్రెన్స్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. సెంట్రల్, ప్రాంతీయ గ్రంథాలయాల నవీకరణ, భద్రకాళీ బండ్‌పై డ్రైయిన్, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పోతన శ్మశాన వాటిక పక్కన నిర్మిస్తున్న లాండ్రీ మార్ట్ ఫేజ్-2 పనులను అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఫేజ్-1 పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, స్మార్ట్‌సిటీ సీఎంవో ఆనంద్ వోలేటి, ఈఈలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, రాజయ్య, లక్ష్మారెడ్డి, డీఈలు నరేందర్, సంతోష్‌బాబు, రవికుమార్, రవికిరణ్, హోర్నిక్స్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మహిళా సంఘాల సభ్యులు ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని మేయర్ సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ ఆధ్వర్యంలో టెక్స్టైల్స్ నిపుణులతో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని టెక్స్టైల్ మెగాపార్కులో త్వరలోనే కేరళకు చెందిన కెటీక్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుందన్నారు. టెక్స్టైల్ మెగాపార్కులో పరిశ్రమల ఏర్పాటు వల్ల సుమారు 11 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఔత్సాహిక మహిళలకు మూడు నెలలపాటు స్పిన్నింగ్, డైయింగ్, నెట్టింగ్, మ్యానుఫ్యాక్షరింగ్లో శిక్షణ ఇస్తారన్నారు. మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెక్స్టైల్ ఓఎస్డీ శాంత తౌటం మాట్లాడుతూ మహిళలు వస్త్రతయారీలో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, మెప్మా పీడీ భద్రునాయక్, టీఎంసీ రమేశ్, ఆర్పీ, టీఎల్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.