
చెన్నారావుపేట, ఆగస్టు 25: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో మొదటిరోజు బుధవారం 28,490 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ చల్లా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా పిల్లలకు ఈ నెల 31వ తేదీ వరకూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. చెన్నారావుపేటలోని కట్టయ్యపల్లె ఉపకేంద్రంలో సర్పంచ్ కే మల్లయ్య మాత్రల పంపిణీని ప్రారంభించారు.
నులిపురుగుల నివారణకు కృషి చేయాలి
ఖానాపురం/నర్సంపేట/నర్సంపేట రూరల్/కరీమాబాద్: పిల్లల్లో నులిపురుగుల నివారణకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్ అన్నారు. ఖానాపురంలో ఆయన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు గోళీలు అందిస్తున్నారు. డాక్టర్ అరుణ్, సూపర్వైజర్ రామలింగయ్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. నర్సంపేటలోని అంగన్వాడీ4 కేంద్రం పరిధిలోని పిల్లలకు అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీవో రాధిక అల్బెండజోల్ మాత్రలు అందించారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలు తప్పకుండా గోళీలు వేసుకోవాలని కోరారు. ఆమె వెంట ఏసీడీపీవో విద్య, కౌన్సెలర్ రుద్ర మల్లీశ్వరి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో విద్యార్థులు, చిన్నారులకు నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముగ్ధుంపురంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతీప్రభాకర్ వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థులకు మాత్రలు వేశారు. వరంగల్ కరీమాబాద్‌లోని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పలు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.
పిల్లలకు మాత్రల పంపిణీ
రాయపర్తి(వర్ధన్నపేట)/నల్లబెల్లి/గీసుగొండ/కాశీబుగ్గ: వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. వర్ధన్నపేట పట్టణంలోని 1, 2వ వార్డుల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కౌన్సిలర్లు తోటకూరి రాజమణి-ప్రసాద్, సమ్మెట సుధీర్‌కుమార్ పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. నల్లబెల్లి, మేడపల్లి పీహెచ్‌సీల వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు సంయుక్తంగా బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. వైద్యాధికారులు శశికుమార్, మహేందర్‌నాయక్ పాల్గొన్నారు. గీసుగొండ మండలవ్యాప్తంగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించినట్లు వైద్యాధికారి మాధవీలత తెలిపారు. సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, సూపర్వైజర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. వరంగల్ కాశీబుగ్గ 19వ డివిజన్లోని అంగన్వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి పిల్లలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కడుపునొప్పి, ఆకలి మందగించడం, రక్తహీనత సమస్యలు వస్తాయన్నారు.