
నల్లబెల్లి, ఆగస్టు 25 : ఒక ఐడియా నల్లబెల్లి మండలం పొదుపు సంఘం మహిళల జీవితాన్నే మార్చేసింది. వ్యవసాయ పనులు చేసే క్రమంలో అల్లంపేస్ట్ వ్యాపారం చేయాలనే ఆలోచన.. వారిని ఆ రంగంలో రాణించేలా చేసింది. ఓ వైపు వ్యవసాయ పనులు చేసుకుంటూనే వ్యాపారంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన మహిళలు. ఇలా మూడేళ్ల క్రితం మొదలైన అల్లం పేస్టు తయారీ క్రమక్రమంగా పల్లె నుంచి పట్టణాలకు అల్లం పేస్టు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. నాణ్యత బాగుండడంతో వివిధ ప్రాంతాల ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయి. తయారుచేసిన పేస్టును వరంగల్, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపూర్, ములుగుతో పాటు నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో జరిగే వివాహాది శుభకార్యాలకు ఆర్డర్‌పై సప్లయ్ చేస్తున్నారు.
ఆర్థిక ప్రోత్సాహం కోసం..
తమ వ్యాపారానికి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని మహిళా సంఘ సభ్యులు కోరుతున్నారు. గ్రైండర్లు కొనే స్తోమత లేక ప్రస్తుతం రోలు, రోకలితోనే అల్లంపేస్ట్ తయారుచేస్తున్నారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తండ్రి చనిపోగా 11 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రెండు క్వింటాళ్ల అల్లం పేస్ట్ సరఫరా చేయగా రూ.10వేల ఆదాయం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అదే సమయంలో తమ సమస్యలు, వ్యాపార విస్తరణ గురించి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి విన్నవించగా, నల్లబెల్లి సంఘాన్ని ఒక యూనిట్‌గా గుర్తించి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు చెప్పారు. అలాగే జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న సైతం గ్రైండర్ కోసం ఆర్థిక సహాయం చేస్తామనడం ఆనందంగా ఉందన్నారు.
మహిళలంతా కలిసి ఒక చోట పొలం పనులు చేసే సమయంలో వచ్చిన ఆలోచన.. వారికి కొత్తదారి చూపింది. మనకు తెలిసిన, వచ్చిన పని.. అందులోనూ నిత్యం అవసరమయ్యే అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వ్యాపారం ప్రారంభించి పల్లెల నుంచి పట్టణాలకు నాణ్యమైన అల్లం సరఫరా చేస్తున్నారు. గుండ్లపహాడ్ కేంద్రంగా మూడేళ్లుగా పేస్ట్ తయారీలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లబెల్లి మహిళా పొదుపు సంఘం సభ్యులు.
సంఘ సభ్యుల ఐక్యత వల్లే..
సంఘ సభ్యుల ఆలోచనతో వ్యాపారం మొదలైనా.. కలసికట్టుగా ఉండడం వల్లే వ్యాపారం వృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే విస్తార్లు, కారాప్యాకెట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టీవీలు, పేపర్లలో పలుచోట్ల మహిళా సంఘల సభ్యులు చేస్తున్న వ్యాపారాలను చూసి ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమవుతుంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
అల్లం పేస్టు వ్యాపారం లాభసాటిగా ఉంది. అయితే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్వాపారం మరింత వృద్ధిలోకి తేవచ్చు. ఓ వైపు వ్యవసాయ పనులు, మరోవైపు అల్లం పేస్టు వ్యాపారం చేయగా వచ్చిన డబ్బులతో కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నాం.
గిరాకీ మంచిగుంది..
అల్లం పేస్టు తయారు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకున్నాం. ఆర్డర్ ప్రకారం అల్లం పేస్టు సరఫరా చేస్తున్నాం. నాణ్యత పాటించడం వల్ల గిరాకీ ఎక్కువగా వస్తోంది. గ్రూపు సభ్యులందరం కలిసికట్టుగా పనిచేస్తూ వ్వాపారం చేస్తున్నాం. పల్లె నుంచి పట్టణాలకు ఎగుమతి చేయడం గర్వంగా ఉంది. తీసుకున్న లోన్ డబ్బులు వృథా చేయకుండా ప్రతి మహిళ అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
-కొండోజు కళమ్మ, సీనియర్ గ్రూపు సభ్యురాలు