వరంగల్, ఆగస్టు 14 : కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారస్తులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం స్వానిధి పథకాన్ని గ్రేటర్ కార్పొరేషన్ సమర్థవంతంగా అమలు చేసింది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో గ్రేటర్ అధికారులు 26,895 మంది వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి పథకం ద్వారా రూ. 10 వేల రుణం మంజూ రు చేయించి రికార్డు సృష్టించారు. దీంతో దేశంలో 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
అన్ని కేటగిరీల్లో..
పీఎం స్వానిధి పథకాన్ని అమలు చేయడంలో తెలంగాణ ముందుంది. అన్ని కేటగిరీల్లో తెలంగాణ నగరాలే మొదటి స్థానంలో ఉన్నాయి. 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో వరంగల్ మొదటి స్థానంలో నిలువగా రెండో స్థానంలో నిజామాబాద్ నగరం నిలిచింది. అలాగే, 40 లక్షల జనాభాపైగా కలిగిన నగరాల కేటగిరీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. లక్షలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరిలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వ సమర్థవంతంగా అమలు చేయడంలో దేశం లో ముందుంది. పేదలకు సంక్షేమ ఫలాలు అందజేయడంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నది.
26,895 మంది వీధి వ్యాపారులకు..
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 26,895 మంది వీధి వ్యాపారులు పీఎం స్వానిధి ద్వారా రూ. 10 వేల చొప్పున రుణం అందుకున్నారు. మెప్మా సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వీధి వ్యాపారులను గుర్తించడంతో పాటు బ్యాంకులను ఒప్పించి రుణాలు మంజూరు చేయించారు. గ్రేటర్ పరిధిలో 36,773 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకోగా 28,275 మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. ఇప్పటి వరకు 26,895 మంది ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున జమ చేశాయి. మిగతా 1380 మందికి వారం రోజుల్లో రుణాలు అందేలా చేసి వంద శాతం రుణాలు అందించిన రికార్డు సాధిస్తామని మెప్మా సిబ్బంది తెలిపారు.
సిబ్బందికి ప్రశంసలు..
10 లక్షల్లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరిలో పీఎం స్వానిధి రుణాల పంపిణీలో దేశంలోనే వరంగల్ నగరాన్ని మొదటి స్థానంలో నిలిపిన మెప్మా సిబ్బందిని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రశంసించారు. ఇదే స్పూర్తితో పని చేయాలని సూచించారు. అలాగే మేయర్ గుండు సుధారాణి, బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్ మెప్మా సిబ్బందిని అభినందించారు.