ఐనవోలు, జూలై 8 : మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీహెచ్ పాఠశాలలో ఇతర గ్రామాల విద్యార్థులకు నో అడ్మిషన్ అంటూ బోర్డు పెట్టారు. తరగతిలో 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే అందరికీ న్యాయం చేయలేమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు తెలిపారు. ఐదు సంవత్సరాలు పూర్తిగా మూతపడి ఈ పాఠశాలను అన్నాహజారే ఇచ్చిన స్ఫూర్తి, బాలవికాస స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ సహకారంతో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధి చేసుకున్నారు. రాష్ట్రంలోనే మొదటి పూర్తి ఇంగ్లిషు మీడియం పాఠశాలగా అనుమతి పొందింది. 2018-19 పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్తోపాటు రెండు, మూడు, నాలుగు స్థానాలను ఇక్కడి విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
2019-20, 2020-21లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించడంతో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఐనవోలు, ముల్కలగూడెం, నందనం, పున్నేలు, రాంనగర్, సింగారం, ఉడుతగూడెం, లింగమోరిగూడెం తదితర గ్రామాల విద్యార్థులు అడ్మిషన్లు కోసం బారులు తీరుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారు 354 మందికి పైగా (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు కాక) విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఎక్కువ మంది విద్యార్థులుంటే అందరికీ న్యాయం చేయలేమని భావించిన ఎస్ఎంసీ కమిటీ, ఉపాధ్యాయులు గురువారం పాఠశాలలో ఇతర గ్రామాల విద్యార్థులకు నో అడ్మిషన్ అనే బోర్డు పెట్టింది. ఈ సందర్భం గా ఎస్ఎంసీ చైర్మన్ రాజు మాట్లాడుతూ.. ఒంటిమామిడిపల్లి పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్లును కేటాయించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.